Hello Guest! Welcome to our Website.
Something you might want to know about us.
Don't be hesitated to contact us if you have something to say.
Showing posts with label కథలు. Show all posts
Showing posts with label కథలు. Show all posts

నేను నా సులక్షణ రెడ్డి.(ఓ సీమ ప్రేమ కథ)

| 0 comments |
|


అందరికీ ప్రేమ అమృతపాణి అరటి పండు నాకు మాత్రం కేవలం దాని తొక్క. ప్రతీ సారి నేను దాని మీద కాలెయ్యటం పడటం పళ్ళూడకొట్టుకోవటం అలవాటయ్యిపోయింది. 
జీవితంలో 1. షైలాభాను, 2. షాన్వాజ్ ఓ చెరగని ముద్ర వేశారు.
ఓ అమావాస్య రాత్రి, దరిద్రుడు దేవదాస్ రాసిన " ప్రేమలో సఫలం పొదందటం ఎలా ? ", అన్న పుస్తకాన్ని తలుపులేసుకుని కొవ్వొత్తి క్రీనీడలో నా కళ్ళజోడు సరి చేసుకుంటూ చదువుతున్నా. 92 వ పేజీలోకొచ్చా, చివరి ఛాప్టర్, పేరు "అదృష్టానికి ఆఖరి మెట్టు". అందులో ఒకంటికాలి పై నిలబడి చేతులు రెండూ పైకి జాపి జోడించి ఈ మళయాళీ మంత్రాన్ని మూడు సారు చదవాలి అని రాసుంది.
మంత్రం: എവഡി കര്‍റ്റകു എവഡു ഖര്‍മാ ( తెలుగనువాదం చివరిలో తెలుస్తుంది ). మూడవ సారి చదవబోతుంటే..."ప్రేమ ఎంత మధురం ప్రియురాళ్ళు ఎంత కఠినం ..." అంటూ నా ఫోన్ మ్రోగింది. రాత్రి 12 అవటంతో బయట నక్కలరుస్తున్నాయి. ఫోనెత్తా...
"హాయ్ మీనూ హాపీ బర్త్డే టూ యు.."-అని అవతల నుండీ వినపడంది.
నేను వెళ్ళి అద్దం లో చూసుకున్నా, అవును నేను నేను లానే ఉన్నాను కదా మరి ఫోన్ లో ఎవరు మీనూ అన్నారు. అనుకుని
నేను నా పాత కాల్ సెంటర్ బాషలో : "క్షేమించాలి మీకు కలిగిన అసౌకర్యానికి. ఇచ్ఛట 'మీను' అను పేరు గలవారెవ్వరూ లేరు. దయచేసి మీ నెంబరు మరొక్క సారి చెక్ చేసుకుని కాల్ చెయ్యగలరని తెలియచేస్తున్నను. "- అన్నను.
అటు: "సారీ సార్ నా పేరు సులక్షణ రెడ్డి. ఈ రోజు మా ఫ్రండ్ మీన పుట్టిన రోజు, పొరపాటున వ్రాంగ్ నెంబర్ నొక్కాను. ...... మిమ్మల్ని డిస్ట్రబ్ చేశాను"
ఇటు: "ఛా ఛా సార్ ఎంటి ??? అశ్విన్ అను. అయినా ఏం పర్లేదులే నేను కోడి కూసేంత వరకూ నిద్రపోను. పొరపాట ఎవరికన్నా జరగచ్చు నోప్రాంబ్లెమ్, ఈ రోజు పొరపాటున నాకు నీదగ్గర నుండి కాల్ వచ్చింది. రేపు నీకు నా దగ్గర నుండీ రావచ్చేమో, నువ్వు దానికి ఫీల్ అవ్వకు ...."-అన్నా
అటు: "ఓహ్ అశ్విన్ ఆ, నైస్ నేమ్ ( ఇటువైపు నేను ఫ్లాటు ) ఒకే ధెన్ బాయ్."- అని ఫోన్ పెట్టేసింది.
ఆహా అదృష్టానికి ఆఖరి మెట్టు పని చేసింది ఆ మంత్రం చాలా గొప్పదిలా ఉంది అని ఆ పుస్తకాన్ని ఆ జాగ్రత్తగా కళ్ళకు దణ్ణం పెట్టుకోని షెల్ఫ్ లో దాచిపెట్టుకున్నా. రాత్రి మూడింటికి మెళుకువ వచ్చి ఆ నెంబర్ ను "౩.సులక్షణ రెడ్డి" అని సేవ్ చేసుకుని హాయిగా పడుకున్నా.
*******
రాత్రి సులక్షణ విషయం చెప్పటానికి మా వాళ్ళంనందరినీ కాలేజ్ మాన్పించా. జరిగినదంతా పూస గుచ్చినట్టు చెప్పా. అంతా విని మా శ్రీకాంతు గాడు. "రేయ్ నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా మన కాంటీన్ ఫుడ్ తింటున్నావా. అసలు ఈ రోజు మీనా B'day అన్నావ్ కదా పొద్దున నుండీ ఫోన్ చేశావా. పరిచయాలు పెంచుకోవాలిరా ఎప్పుడు నేర్చుకుంటావ్ చెప్పు. పనిలో పని నన్నూ పరిచయం చెయ్యి, ఎన్నాళ్ళని నేను మాత్రం నీ చూట్టు తిరగను చెప్పు వాళ్ళ ఫ్రండ్స్ ఉంటారుగా, ఏమంటావ్ "- అని నాకు సలహా ఇచ్చినట్టే ఇచ్చి ప్రాధేయపడ్డాడు.
శ్రీకాంత్ నాలాగే ఓ ప్రేమ ఖైది, ఓ ప్రేమ దొంగ, ఓ ప్రేమ ఫకీర్, ఓ ప్రేమ దరిద్రుడు.
"సరీ-గమా-పద-నిస్సా...అరె కరో కరో ఇక జల్సా...." అంటూ నా ఫోన్ మోగింది.
శ్రీకాంత్: ఏంట్రా రింగ్ టోన్ మార్ఛినట్టున్నవ్??
నేను: రాత్రి ఏదో మంచి కలొస్తే....
వాడు. నీకు తొందరెక్కువరా
నేను: నీకు కుళ్ళెక్కువకానీ మందా ఆ ఫోనెత్తు.
వాడు: "రేయ్ సులక్షణ రా ఉండు నేను మానేజ్ చేస్తా.." -అని ఫోనెత్తాడు.
ఫోన్లో:: "హలో అశ్విన్ ఉన్నాడా ??"
శ్రీకాంత్:"హలో... అశ్విన్ ఆ, చదువుకుంటున్నాడండీ, వాడు కాలేజ్ టాపర్ కదా చదువుకుంటూ ఉంటాడు. మొన్న క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యాడు కానీ ఛదువే లోకం అనుకునే మనిషి అండీ వాడూ...( నిజం చెప్పాలంటే నేను నా Supplementary Exams కి స్లిప్పులు రాసుకుంటున్నాను). అసలు మావాడని చెప్పటం కాదుకానీ మావాడికి రానిదంటూ ఏమీ లేదు భరతనాట్యం, వెస్ట్రన్ డాన్సూ, వేణువు, కరాటి, కర్రాట, వంటొండటం, ముగ్గులేయటం, చివరికీ చెప్పులు కూడా అధ్బుతంగా కుడతాడు. ఇక ప్రోగ్రామింగ్ లోకొస్తే Java, Oracle, Html, Xml, Bsnl లో దిట్ట. ఉండండి వాడిని పిలుస్తాను అని . "రేయ్ అస్సిగా పొద్దున్నుండి చదువుతున్నవ్, ఓ ఐదు నిమిషాలు రిలాక్స్ అవ్వు సులక్షణ అంట, నీకు ఫోన్ ర్రా.."- అన్నాడు కొంచం గట్టిగా.
నేను తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ లా "ఏంటీ సులక్షణానా..." అని పరిగెడుతున్నట్టు చెప్పుల సౌండ్ చేసి, ఆయాస పడుతూ ఫోన్ తీసుకున్నా... అక్కడ నాకు 200/100 మార్కులు పడ్డయ్ మా శ్రీకాంత్ గాడి ప్లాన్ వల్ల.
***
ఇక అప్పటి నుండీ మొదలు, ఏమ్ మాట్లాడూకుంటామో ఏమో తెలియదు కానీ ప్రతీ రోజూ మాట్లాడుకుంటునే ఉండే వాళ్ళం. నెమ్మిదింగా సులక్షణ కాల్ చెయ్యటం మానేసి Missed calls మాత్రమే ఇచ్చేది. తను అలా మిస్డ్ కాల్ ఇవ్వగానే నేను చేసేవాడిని.కాదు చెయ్యాల్సొచ్చేది. కనీసం రోజు కు ఓ రెండు వందలయ్యేది, ఫోన్ ఖర్ఛు. ఏం మాట్లాడుకుంటామో తెలియదు కానీ గంటలు గంటలు గడిచిపోయేవి. ఏదో రోగం వచ్చినవాడిలా ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతునే వుండేవాడిని. అ చెవి నెప్పొస్తే ఈ చెవితో, ఆ చెయి నొప్పొస్తే ఈ చేతితో, రెండు చెవులూ నొప్పొస్తే Loud speaker పెట్టుకుని, రెండు చేతులూ నెప్పొస్తే బుజానికీ తలకూ మధ్యలో ఫోన్ పెట్టుకునీ మాట్లాడుతునే ఉండేవాడిని. మా కాలనీ వాళ్ళు "పిల్లోడు నిన్నటివరకూ బానే ఉండేవాడమ్మా ఏమైందో ఏమో "- అని కొందరు అనుకుంటుంటే మరి కొందరు "వీడెప్పుడో మాట్లాడుతునే పోతాడాని మరికొందరు అనుకునే వాళ్ళు.", ఎవరేమనుకున్నా గురి తప్పని అభినవ్ బింద్రా లా నేను చలరేగిపోయేవాడిని. నువ్వు నాకు నచ్చావ్, నిన్నే ప్రేమిస్తా వరకూ వచ్చింది మా కధ. అన్నీ బానే ఉండేవి ఆ ఒక్క ఫోను బిల్ తప్ప. నాకు అప్పటిలో Best Vodafone User of the Year అని అవార్డు ఇచ్చారు. చివరకు Congrats చెప్పటానికీ తను Missed కాలే ఇచ్చింది.
***
అసలు మా ప్రేమను ప్రేమ లేఖ సినిమాలా మేంటేన్ చెద్దామనుకున్నా. ఓ సారి తను "అశ్విన్ నీకు హాలీడేస్ యే గా మా ఊరు రావచ్చుగా అంది. వస్తాడు నా రాజు ఈ రోజు.... అంటూ వెయిట్ చేస్తా, మనది మామూలు ప్రేమ కాదు కృష్ణా- విజయనిర్మల ప్రేమ అంది,"-ఇక్కడ నేను ఫ్లాట్. నా ఉద్దేశంలో
ప్రేమికులంటే కృష్ణా- విజయనిర్మల,
జంట అంటే కృష్ణా- విజయనిర్మల,
భార్యా భర్తలంటే కృష్ణా- విజయనిర్మల.
తనూ కృష్ణా- విజయనిర్మల అనగానే కాదనలేకపోయా.
"ఇంతకీ నెన్నెక్కడికి రాను ?" అనిడిగా
అప్పుడు నాకటువైపు నుండీ వినపడిన శబ్దం "క-డ-ప"
****
శ్రీకాంత్ గాడే దగ్గరుండి నాకు కొబ్బరికాయతో దిష్టి తీసి కడపకు తన డబ్బులతోనే బస్సెక్కించాడు. మన తెలుగు సినిమాలలో లాగా కాకుండా పెద్ద పెద్ద ట్విస్టులేమి లేకుండా ఇద్దరం కలుసుకున్నాం. సులక్షణ అన్న పేరు వినగానే పేరుకు తగ్గట్టు ఉంటుందనుకున్నా, కానీ మన తెలంగాణా శకుంతల డిగ్రీ చదివేటప్పుడు ఎలా ఉండేదో అచ్చు అలానే ఉంది. అయినా గతి లేని వాడికి గంజేనమ్మ పానకం అన్నట్టు.అడ్జస్ట్ అవుతామ్ అందులో ఏముంది. అందందేముంది ?? మనసు, మనసు ముఖ్యం కదా.
Restaurant కు వెళ్ళాం, చాలా సేపు మాట్లాడూకున్నం, సాయంత్రం నాలుగయ్యింది. దగ్గరలో ఉన్న పార్కు కు వెళ్ళం. నాకు కడపలో అడుగుపెట్టినప్పటి నుండీ ఓ వింత అనుభవం ఎదురయ్యింది. మేమిదరం అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే అందరూ నన్ను చూసి గుసగుసలాడటం గమనించాను. అందులో నన్నైతే ఏదో వింత జంతువును చూసినట్టు చూస్తున్నరు. సరే అని పార్కులో ఓ చోట కూర్చున్నాము. ఓ పది నిమిషాల నిశబ్దం తరువాత.
తను "మీ ఇంట్లో వాళ్ళు మన ప్రేమకు ఒప్పుకుంటారా ? "-అని అడిగింది.
నేనొప్పిస్తానుగా అన్నాను, తను దానికి "నీకో విషయం చెప్పాలి". ఆకాశం ఒక్కసారిగా మేఘామృతమయ్యింది. ఒక్కసారిగా ఓ పెద్ద శబ్దం, మెరుపులు.
తను: "నువ్వు సమరసింహారెడ్డి సినిమా చుశావా ????"
నేను: హహా బారులు తీరిన బాలకృష్ణ ఫానులలో ముందుండేది నేనే తెలుసా?
తను : " కామెడీ కాదు సీరియస్, ( తను ఎంతో ఆవేశంగా లేచి, నెమ్మిదిగా చెప్పటం మొదలు పెట్టింది) సమరసింహారెడ్డి , ఆ సినిమా బేస్ స్టోరీ మాదే. మా తాతల నుండీ మా శత్రువు. ఆ వీరరాఘవరెడ్డి. వాడి రక్తం నేను కళ్ళ చూడాలి, మా నాన్న గారు ఆదికేశవ రెడ్డి, వాళ్ళంటిమీద కాకి మా ఇంటి మీదవాలిందని కాకికి గురిపెడితే, ఆ కాకెగిరిపోవటంతో ఆ గుండు, గుండు వీరశంకర రెడ్డికి తగిలింది. మా నాన్నకు జీవిత ఖైదు పడింది, నాకు ఇద్దరన్నలు, పెద్దన్నయ్య చెన్నకేశవ రెడ్డి, ఆల్-ఖైదా తో అర్రగ్రేటం చేశాడు తాలీబాన్ కు పారిపోయాడు. మా రెండవ అన్నయ్య గోధారెడ్డి, నక్సలైట్ గా ఆరేళ్ళు చేసి మొన్ననే జల్సా సినిమా చూసి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. నా ప్రతీకారాన్ని, మా నాన్న ప్రతీకారాన్నీ తీర్చటానికి ఓ మోగాడు కావాలి. నన్ను నువ్వు చేసుకుని ఆ వీరరాఘవరెడ్డి తల మా ఊరి నడి బొడ్డున తెగ నరికి మా నాన్నకు క్యాసుల్కం గా ఇవ్వాలి. ఆ రక్తం తో నా నుదుటున మన కళ్యాణ తిలకం దిద్దూ .... చెప్పూ చంపుతావా వాడిని,నా పగా, మా నన్న పగా తీరుస్తావా?"- అనడిగింది.
వామ్మో...... వార్నాయినో ... ఈ చంపటమేమిటో ... ఆ రక్త మేమిటో...ఆ రక్తంతో బొట్టు పెట్టే ఆ Effect ఏమిటో .... నాలుగు ముక్కలు చదివి రెండు మూడు నెలలలో Soft గా మృదుపరికరణ నిపుణుడిగా ( Software Proffesional )జీవితం మొదలు పెడదాం అనుకుంటుంటే.... ఈ ప్రేమతో నా పాడె లేచేటట్టువుంది. నాకు కాళ్ళు తడిపోతున్నాయి. చెమటలు పట్టేస్తున్నాయి. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్ధితి.
ఇంతలో తను "చెప్పు ఛంపుతావా... నాపగ ఛల్లారుస్తావా ??" అంది. నాకు ఏం చెప్పలో అర్ధం అవ్వట్లేదు. ఛంపుతా అన్ననే అనుకో వాడెవడో వీరరాఘవ రెడ్డి అంటా వాడింటికి తీసుకేళుతుండేమో ???, చంపనూ అంటే నా పని ఇక్కడే అవుట్ దీని చేతిలో. ఇంతలో తనుకు ఫోనొచ్చింది. తను గట్టిగా "అలానా ???" అంది. నాకిక్కడ పిచ్చెక్కిపోతుంది.
తను "అశ్విన్ , మనం ఇక్కడున్నమని ఆ వీరరాఘవ రెడ్డి మనుషులకు తెలిసిపోయిందంటా. నిన్ను చంపటానికి వాళ్ళు వస్తున్నారు "-అంది. నాకు ఆ మాటకే గుండాగిపోయింది. చీమకు కూడా హాని చెయ్యని నన్నెందుకు చంపటం. అన్నెం పుణ్యం ఎరుగని నాలాంటి పసికందు మీదా వీళ్ళ ప్రతాపం.
"ఏంటి ఆలో చిస్తున్నావ్ ???? అశ్విన్ అర్జెంటుగా తొడకొట్టు "-అంది. నేను జాలిగా తన వంక చూశాను.
"ఏం పర్లేదులే... అని భూ ప్రపంఛం బద్దలయ్యేలా భూ-మా-రె-డ్డీ "-అని అరిచింది.
ఉన్న పేర్లే గుర్తుపెట్టుకోలేక చస్తుంటే మళ్ళీ వీడెవడా అనుకునే లోపే ఓ సుమో వచ్చింది. నన్ను లోపలకు ఓ నెట్టు నెట్టింది.
ఊపిరి కూడా సరిగా తీసుకోలేనటువంటి పరిస్ధితి నాది. నిజంగా నన్ను ఎవరన్నా చంపటానికి వస్తున్నారో ఏమో తెలియదు కానీ వీళ్ళ హడావిడి మాత్రం నన్ను నరకయాతనకు గురిచేస్తుంది. ఇంతలో ఫోన్ మోగింది. తీరా చూస్తే మా శ్రీకాంత్ గాడు.
" అస్సి గా పండా కాయా ?" అనిడిగాడు, "పండూ కాదు, కాయా కాదు, బాంబు రా, " అని గట్టిగా ఏడవబోతుంటే,సుమో ఆగింది. నా గుండా ఆగింది. బయటకు చూస్తే -రైవ్లే స్టేషన్. బయట నుండే ప్లాట్ ఫారమ్ మీద ఏదో ట్రైన్ నెమ్మిదిగా కదులుతూ కనపడింది.
రన్నింగ్ ట్రయింగ్ ఎక్కిస్తూ... "ఏం పర్లేదులే ఇక్కడ అంతా నేను చూసుకుంటా వాళ్ళు కనుక మళ్ళి ఎటాక్ చేస్తే ఈ బాంబు వెయ్యి "- అని తన హాండ్ బాగ్ లో నుండీ ఓ బాంబు తీసి నాకిచ్చింది. నాకన్నీ వొణికిపోయాయి. ఆ బాంబు నా చేతికిస్తూ నా ఆశలన్నీ నీ మీదే, I LUV U "-అంది.
"నాకు గట్టిగా ఏడవాలనిపించింది. ఆహా ఏం టైంమింగే నీది, నా జీవితం మీద ఆశలొదులుకో అన్ని ఎంత సింబాలిక్ గ్గ్గా చెప్పావే. దరిద్రపు మొహందానా, చిన్నప్పుడు సీమటపాకాయ పేల్చాలంటే అరమీటరు పాపరుతో వెలిగించి, అరకిలోమీటర్ దురం వెళ్ళి, చెవిలో చేతులు పెట్టుకుని నుంచుండే వాడిని. అలాంటిది బాంబు చేతిలో పెట్టావా? ఎందుకూ పనికి రాని చిల్లు పడిన బిందెలా ఆ మొహం చూడు."- అని మనసులో అనుకుని,నేను కూడా I 2 LUV U అన్నా.
ట్రైన్ స్పీడందుకుంది. టాటా చెప్పి. ఎడం చేతిలో బాంబు, కుడిచేతిలో టికెట్, జేబులో సెల్ పెట్టుకుని, మళ్ళీ ఎవడొస్తాడో,ఏ క్షణాణ ఏమౌతుందో అని, అని బాత్ రూమ్ లో దాక్కున్నా. కొన్ని గంటల తరువాత.....బయట శబ్దం వినపడితే తొంగి చూశా... ప్రకాశం బారేజ్.... హమయ్యా అనుకుని, ఆ బాంబు, నా Vodafone సిమ్ కృష్ణ లో పడేసి, తూర్పు తిరిగి ణ్ణం పెట్టా.
జరిగినదంతా మా శ్రీకాంత్ గాడికి చెప్పటానికి రెండు రోజులు పట్టింది. మీకు చెప్పటానికి ఈ టపా అయ్యింది. ఇంటికి రాగానే వారం రోజులు నన్ను ICU లో పెట్టారు, ఇంతకీ మళయాళీ మంత్రాం എവഡി കര്‍റ്റകു എവഡു ഖര്‍മാ అర్థమేమిటో మళయాళం తెలిసిన ఓ స్నేహితుడినడిగా వాడు దానికి "ఎవడి ఖర్మకు ఎవరలు కర్తలు "-అని సమాధానమిచ్చాడు.

నేను నా నిశాకొట్ట్ట్టారి నా ఉద్యోగం

| 0 comments |
|

జీవితంలో ప్రతి ఒక్కరు రెండుసార్లు సర్కస్ కు వెళతారు. మొదటి సారి తను ఐదవ తరగతిలో ఉన్నప్పుడు, రెండవసారి తన కొడుకో/కూతురో ఐదవ తరగతిలో ఉన్నప్పుడు. కానీ, నేను మాత్రం వీటికి విరుద్ధంగా నా ఇంజినీరింగ్ అవ్వగానే వెళ్ళాసొచ్చింది. ఆడించేవాడిలా కాదు, ఆడేవాడిలా. ఆ సర్కస్ పేరు మా ఆఫీస్.



నేను ఇంజినీరింగ్ పరిక్షలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసి,గురక పెట్టి మొద్దు నిద్రపోతున్నా...అంతలోనే ఓ మంచి కల. ఆ అమ్మాయెవరండి బొత్తిగా బట్లేసుకోదు. డైరెక్టర్ వేసుకోమన్నా, మమ్మీ నేనేసుకోనని మారం చేస్తుందే.... ఛా సమయానికి పేరు గుర్తుకురావట్లేదు, ఆ... నిషా కొటారి బీచ్ వడ్డున నా వైపు స్లో మొషన్ లో పరుగెత్తుకుంటూ వస్తుంది. నేను కూడా ఆ చల్లని గాలికి నా రెండు చేతులూ చాపి తనని ఆహ్వానిస్తున్నాను. తీరా తను నా దగ్గరకు వచ్చేసరికి ఓ అమ్మాయి ఓ కెమెరామెన్ ఎక్కనుండి వచ్చారో తెలియదు కానీ సీన్ లోకి ఒక్కసారిగా వచ్చి మైక్ నా ముందు పెట్టి 'మీ పేస్టులో ఉప్పుందా ? ' - అని అడిగింది. నేను తలగోక్కోని ' మా పేష్టులో ఉప్పు సంగతి నాకు తెలియదు కానీ మా నాన్నకు మాత్రం రెండు లక్షల అప్పు మాత్రం ఉంది ' - అన్నా. ఇది విన్న నిషా కొటారి ఎలా వచ్చిందో అలానే స్లో మొషన్ లో వెనెక్కెళ్ళి పోయింది. నేను తన కోసం ఓ అరగంట వెయిట్ చేసి తీరా తను మళ్ళీ రాకపోతే నేను ఒక్కడినే అక్కడ ఏం చేస్తానని నెమ్మిదిగా కళ్ళు తెరిచా.
కళ్ళు తెరచీ తెరవగానే ఎదురుగుండా మా నాన్న కాఫీ కప్పు పట్టుకుని కనపడ్డాడు. మొదట ఖంగారు పడ్డా ఈ ఛాన్స్ మళ్ళీ రాదని ముందు కాఫీ తాగేసా.
" అస్సిగా  ఏంట్రా రేపు మీ కాలేజిలో కాంపస్ ఇంటర్వీలు ఉన్నాయని నాకు చెప్పలేదే ? "
" ఆ శ్రీకాంత్ గాడు నీకు ఫోన్ చేశాడా, నీకు చెప్పొద్దని వాడి కాళ్ళా వేళ్ళా పడ్డా, రెండొందలిస్తే చెప్పనన్నాడుగా ...."
" ఆ రెండొందలు సరిపోయినట్టులేవు అందుకే నాకు ఈ సంగతి చెప్పి ఇంకో రెండొందలు తీసుకున్నాడుగానీ మరి రేపటి సంగతేంటి ? "
" అబ్బా ఆ సాఫ్ట్వేర్ ఉద్యొగాలు మనకు రావునాన్నా. అయినా అవన్నీ అంత సులువనుకున్నావా ఎంటీ ?. ఈ కాంపసులలో సెలెక్ట్ అవ్వటం కంటే ఓ పార్టీ పెట్టి C M అవ్వటం సులువు. "
" అమ్మ పుట్టినిల్లు మేనమామకు తెలియదా అన్నట్టు నీ తెలివితేటలు నాకు తెలియదా? అందుకే అన్ని వివరాలు సేకరించా మొత్తం రెండురౌండ్లు ఉంటాయట. మొదటి రౌండ్ written రెండవ రౌండ్ H R. నిన్ననే మీ క్లాసు పిల్లలందరికి రోల్ నెంబర్ వారిగా తలా రెండొందలు పంచిపెట్టా కబట్టీ నువ్వు ఎవరి పక్కన పడ్డా ఖచ్చితంగా చూపించి తీరతారు. అదవ్వగానే రెండవ రౌండ్ H R అంట మహాయితే tell me about yourselves అంటే నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకో అని అడుగుతారు. మొన్నటిదాకా ఎన్నికలు ఫాలో అయ్యావ్ గా గమనించావో లేదో మన రాజకీయనాయకులందరూ చేసిందదే వాళ్ళను నువ్వు ఫాలో అయ్యి ఆవిధంగా నీవు ముందుకు పోవచ్చు. ఇక నావంతు కర్తవ్యంగా విజయవాడలోని గుళ్ళలో, మసీధులలో, ఆ ప్రభువు సన్నిధులలో నీ పేరు మీద ప్రత్యేక ప్రార్ధనలు చేయిస్తాను. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అదృష్టం బావుండాలే కానీ జీవితంలో ఏదైనా జరగచ్చు.", అని మాట్లాడుతూ మాట్లాడుతూ తన పైజమాలో లోంచి చిన్న కాయితం తీసి కళ్ళజోడు సర్దుకుంటూ ..
" అదృష్టం ఉన్న బోడిముండకు మంత్రిగారింటి మంగళహారతికి స్పెషల్ invitation వచ్చిందంట", అని తన సొంత సామెతొకటి వినిపించారు.
ఇక్కడ ఎవరిని తిట్టారో నాకర్ధమయ్యే లోపు ఫోను మొగింది. మా కాంతుగాడు.
"ఏరా కాంతు గా మా నన్న దగ్గర బా ఇరికింవావుగా "
"ఇరికించటం ఏముందిరా సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే మాములు మాటాలా రా చెప్పు ఒక్కసారి ఎదోక్కంపనీలో సెలెక్ట్ అయ్యావంటే జీవితం సెటిల్ అయ్యిపోయినట్టేరా "
"ఈ సాఫ్వ్టేర్ కంపనీలంటే పెద్ద తలకాయనెప్పంట కదరా మన జీవితమంతా వాటికి ధార పొయ్యాలంట కదా మన సుధీర్ చెప్పాడు. మనకా తల నొప్పవసరమా చెప్పు ?"
" ఎవడ్రా ఆ చెప్పిన వెధవ ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కన్నా ప్రశాంతమైన జీవితం మరొకటి ఉండదు. పొద్దున్నే నువ్వు రెడీ అవ్వగానే నిన్ను రిసీవ్ చేసుకోటానికి ఓ కారు వస్తుంది. ఆ కార్ లోనే తెలుస్తుంది ఆ రోజు నీ షెడ్యూల్ అంతా. నువ్వు కంపెనీలో చేరగానే నీకు రెండు లాప్ టాప్స్ ఇస్తారు ఒకటి జిమేయిల్, ఆర్కూట్ గట్రా చూసుకోటానికి రెండవది అప్పుడప్పుడూ పని చెయ్యటానికి. రెండు లాప్ టాప్స్ ఎలా మొయ్యాలా అని ఇప్పటి నుండే ఆలోచించెయ్యమాక. అవి మొయ్యటానికి అరుణాచలం సినిమాలో రజనికాంత్ కు రంభలా నీకు ఓ పరసనల్ అసిస్టెంట్ ని ఇస్తారు. తను నీ లాప్ టాప్స్, ఫైల్స్ గట్రా తను మొస్తుంది. ఆఫీసుకు మన కాలేజికి వెళ్ళినట్టు పొద్దున్నే తొమ్మిదింటికల్లా వెళ్ళక్కరలేదు పది పదకొండు మధ్యలో వెళ్ళొచ్చు. వెళ్ళాగానే పర్లేదు ఓ గంట పని చెయ్యొచ్చు. ఒంటిగంటకల్లా ఫైవ్ స్టార్ లంచ్. లంచ్ అవ్వగానే లైట్ గా కునుకు తీసి నీకు మొళుకువ వచ్చిన తరవాత ఓ గంట పని చెయ్యొచ్చు. ఒక్క నిషా కటారి ఏంట్రా తెలుగు, తమిళ, మళయాళి, హిందీ సినిమా హీరోయిన్ లాంటి వారు నీ చూట్టూ ఎప్పుడూ నవ్వుతూ కనపడుతారు. నీకు కళాపోషనుంటే వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫి. మళ్ళీ ఐదింటికల్లా మళ్ళీ కార్ లో ఇంటికి. . వీకెండ్స్ పార్టీస్ పండగలకు పబ్బాలకు స్వీట్స్, గిఫ్ట్స్ . రోడ్లపైన ఎంత ట్రాఫిక్కున్నా నీ కార్ వస్తుందనగానే అందరూ అడ్డు తప్పుకుంటారు. ఇలా ఓ ఆర్నెల్లు కష్టపడగానే ఎబ్రోడ్ ఛాన్స్. ఎబ్రోడ్ ఛాన్స్. అనగానే మళ్ళీ నీకు రెండు లాప్టాప్స్ ఇస్తారు ఎందుకంటే ఇండియాలో లాప్ టాప్స్ అమెరికాలో పనిచెయ్యవు. నీ పర్సనల్ అసిస్టెంట్ ని కూడా మారుస్తారు . ఎందుకంటే
" ఇండియా నా పర్సనల్ అసిస్టెంట్స్ అమెరికాలో పనిచెయ్యరా ? "
" నీ బొంద కొంచం ఛేంజ్ కోసం బే "
ఒక్కసారి నువ్వు ఎబ్రోడ్ కు వెళ్ళి వచ్చావంటే పోకిరి సినిమాలో బ్రహ్మానందం చూట్టూ బిచ్చగాళ్ళు పడ్డట్టు నీ చూట్టూ మిగతా కంపెనీ వాళ్ళందరూ వాళ్ళ కంపెనీలో పనిచెయ్యమని తిరుగుతారు. ఆటోమెటిగ్గా భారత్ మాట్రిమోనిస్ లో నీ రేటు కోటికి రీచ్ అవుతుంది. ఇక ఈ కంపెనీలలో ఓ పదేళ్ళు పని చేశావంటే భారత ప్రభుత్వంవారు వారు నీ సేవలను గుర్తించి ఐ.టి రత్న, ఐటి బూషణ్, ఐ. టి విరాట్, ఐ. టి జంబలకిడిపంబ వంటి గౌరవమైన పురస్కారాలతో నిన్ను సత్కరిస్తారు. కిరీటాలు, సత్కారాలు, విజయవాడ వీధివీధుల్లో నీ విగ్రహాలు. ఇప్పుడు చెప్పురా అలాంటి జీవితం నీకొద్దా ? నేను కార్లలో వెళుతుంటే నువ్వు ఎం చెయ్యలేక నాకు టాటా చెపుతావా ? ఒక్కరోజు కష్టపడలేవా ? "- అని నన్ను ఉత్తేజపరచాడు
ఇవన్నీదొంగచాటుగా విన్న మా నాన్న నన్ను సాఫ్టేవ్ ఇంజినీర్ గా ఊహించుకుని ఆనందంతో ఆనందభాష్పాలు రాల్చాడు.
అది నా మనసుకు కదిల్చింది వెంటనే జనకా ఆనాడు ఎన్టియోరు తన తలితండ్రులకోసం గులేబకావళి పువ్వు తెచ్చాడు. ఈనాడు నేను ఎలాగైన ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం పీక్కోనొస్తా నన్ను దీవించండి అని అడిగా
వెంటనే మా నాన్న ఓ కత్తితో ఓ దోమను చంపి దానితో నాకు వీరదోమ తిలకం దిద్దాడు.
ఇంత చిన్న గాప్ లో కత్తెలా వచ్చిందని ఆశ్చర్యానికిలోనైన నేను ఆత్రం ఆపుకోలేకడిగేశాను.
ఇదా నువ్వు ఇంటర్వ్యూ కూ వెళ్ళవని వేషాలేస్తావేమొనని పొద్దున పాలు తేవటానికి వెళ్ళినప్పుడు మన సందు చివర మటన్ మస్తాన్ కత్తి జేబులో పెట్టుకొచ్చా. కానీ నాకిప్పుడు ఆ అవసరం లేదు రా ఎందుకంటే ఇప్పుడు నా కొడుకు ఎన్టియారు అని వాత్సల్యంలో ఎన్టియారు లా గట్టిగా వాటేసుకున్నారు.
నేను జయప్రదలా ఊపిరాడక ఛఛ్చా
***** 
ఆ రోజు కెమెరా విజయవాడలోని గుళ్ళు, మసీధులు, చర్చిలను లాంగ్ షాట్ లో చూపిస్తుంది. బాగ్రౌండ్ లో ప్రార్ధనలు అన్నీ గట్టిగా వినపడుతున్నాయి. మా నాన్న ప్లాన్ వల్ల నా పక్కన పడ్డవాళ్ళు చూపించటంతో written పూర్తి చేసా. H R రౌండ్ లో కూడా మా నాన్నగారు చెప్పిన విధంగా ముందుకు పోయా. ఇంటికెళ్ళా మా ఇంట్లో టెన్షన్ తట్టుకోలేక మాఅమ్మ గోర్లు మా చెల్లి, మా చెల్లిగోర్లు మా నాన్న, మా నాన్నగోర్లు మా అమ్మ కొరుక్కోవటం మొదల పెట్టారు. నేనెవరి గోర్లు కొరకాలో తెలియక మా బామ్మ గోర్లు కొరికితే రోకలి బండ పెట్టి ఒక్కటేసింది. సరిగ్గా సాయంత్రం ఐదింటికి ఎవరో తలుపు కొట్టారు. తీరా చూస్తే ఓ ఐదారొందలమంది అందులోనుండి మా ప్రిసిపాల్ అందరినీ నెట్టుకుంటూ ముందుకు వచ్చి నా మెడలో దండవేసి 'కంగ్రాట్స్ అశ్విన్ మొత్తం మీద నువ్వు XXX లో సెలెక్ట్ అయ్యావ్. అయినా ఇంతమంది టాపర్స్ ఉండగా దరిద్రంగా నువ్వు సెలెక్ట్ అవ్వటమేంటని ఒకటికి పది సార్లు చూశా. ఇదిగో నీ ఆర్డర్స్ ని ఆడర్స్ చేతిలో పెట్టాడు.' మా మాటలకు మా నాన్న కళ్ళుతిరిగి కింద పడిపోయాడు.."
అశ్విన్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ హూ హ హూ హ అని అందరూ ఓ అరగంట పాటేసుకున్నారు. అంతలో సృహలో కొచ్చిన మా నాన్న ఓ వెయ్యిచ్చి పార్టీ చేసుకోమన్నాడు. ఆ రోజు సాయంత్రం విజయవాడ ఈగల్ లో పెద్ద పార్టీ. ఫుల్లుగా తాగొచ్చిన నేను , గురక పెట్టి మొద్దు నిద్రపోతున్నా...అంతలోనే ఓ మంచి కల. ఆ అమ్మాయెవరండి బొత్తిగా బట్లేసుకోదు. డైరెక్టర్ వేసుకోమన్నా మమ్మీ నేనేసుకోనని మారం చేస్తుందే.... ఛా సమయానికి పేరు గుర్తుకురావట్లేదు, ఆ... నిషా కొటారి బీచ్ వడ్డున నా వైపు స్లో మొషన్ లో పరుగెత్తుకుంటూ వస్తుంది. నేను కూడా ఆ చల్లని గాలికి నా రెండు చేతులూ చాపి తనని ఆహ్వానిస్తున్నాను. తీరా తను నా దగ్గరకు వచ్చేసరికి ఎవరో ఇద్దరు గుర్రాలపైన వచ్చి ఇనుప సంకెళ్ళతో భందించి ఓ బాక్సింగ్ రింగ్ లో పడేశారు. ఆ బాక్సింగ్ రింగులో ఓ అరవీరభయంకరుడు నన్ను పిచ్చకొట్టుడు కొట్టటానికి గ్లౌజులేసుకుని సిద్దంగా ఉన్నాడు. వాడి మెడలో 'ఐ యామ్ వినాస్ బేరా' అని రాసుంది. ఎందుకొచ్చిన గొడవని పారిపోటానికి రింగు దిగి పారిపోదామనుకుంటే ఆ రింగ్ బయట ఓ సింహం నా వంకే సూస్తూ ఉంది. ఆ సింహం మెడలో 'ఐ యామ్ బైసాకి సేన్గుప్తా' అని రాసుంది. ఛఛాన్రా దేవుడా రింగులో ఉంటే ఈ వినాస్ బేర గాడు చంపేస్తాడు. రింగు దాటితే ఈ బైసాకి సేన్గుప్తా నమిలి మింగేస్తుంది. అయినా ఆ గుర్రాలమీద వచ్చిందెవరైయుంటారు అని చూస్తే మా నాన్నా, శ్రీకాంత్ గాడు. ఇంతలో ఆ వినాస్ బేరా గాడు నా మీదకు దూకి ముక్కుపై ఒక్కటేశాడు. ఉలిక్కి పడి ఒక్కసారి మెళుకువ వచ్చింది.
*******************
ట్రైనింగ్ అంతా కేరళా చూస్తూ గడిపేశా. చాలా సినిమాల్లో హీరోగారికి నిజం క్లైమాక్స్ లో తెలుస్తుంది. నాకు మాత్రం హైదరాబద్ లో మొదటరోజు ఆఫీస్ కు వెళ్ళగానే నిజం తెలిసింది. ఇక్కడ నాకు తెలిసిన నిజం మైసూర్ బజ్జీ లో మైసూర్ ఉండదని కాదు. మా కాంతు గాడు పచ్చదనం పరిశుభ్రత పేరు మీద/క్రింద నా చెవిలో ఏకంగా పెద్ద కాలీఫ్లవర్ నాటాడని. వాడు చెప్పిన దానికీ ఇక్కడ పరిస్ధితికి విక్స్ కి లక్స్ కి ఉన్నంత తేడా ఉంది.
నేను ఉషకిరణ్ మూవీస్ లో తప్ప ఎప్పుడూ ఉదయించే సూర్యూడిని చూడలేదు. చూస్తాననీ అనుకోలేదు అలాంటిది ఉద్యోగంలో జాయిన్ అయినప్పటినుండి ప్రతిరోజు ఉదయించే సూర్యుడూ నేనూ హాయ్ చెప్పుకుంటున్నాం. ఆఫీసుకు దగ్గరని నేను కూకట్ పల్లిలో ఉంటున్నాను. కూకట్ పల్లిలో కుక్కలెక్కువ ఆ కుక్కలకు నా పై మక్కువెక్కువ. ఫార్మల్స్ లో ప్రతిరోజు రెడీ అయ్యిరాగానే మా ఇంటోనర్ గాడిద కుక్క ( కవి హృదయం:: ఇక్కడ గాడిద అంటే >> మా ఇంటోనర్, కుక్క అంటే ఆ గాడిద కుక్క ) తను కొత్తగా కొనుక్కున్న డొకొమో లో 'ఎటాక్' ఓ మూడు కుక్కలకు యస్ యెమ్ యస్ పెడుతుంది. అంతే కాక ఒక్కొక్క కుక్కని మరో మూడు కుక్కలకు యస్ యెమ్ యస్ పెట్టమని చెపుతుంది. ఇలా ఓ రెండు నిమిషాలలో ఈ నెట్వర్క్ పెద్దదై కూకట్ పల్లిలోని కుక్కలన్నింటికి యస్ యెమ్ యస్ చేరుతుంది. మమ్మీ సినిమల్లో దయ్యాలులాగా అవన్నీ నా వెంబడపడతాయి. అవన్నీ పరుగెత్తేది నా సిగ్గుబిళ్ళ కోసం. కవి హృదయం :: సిగ్గుబిళ్ళ ఆంటే నా I D Card. ఈ కుక్కలకు నా I D కార్డ్ కు మధ్య ఆ డావిన్సీ కోడ్ ఎంటో నాకెంతాలోచించినా అర్ధం కాదు. అందరి ఆఫీసుల్లో లానే మా ఆఫీసులో I D కార్డ్ కంపల్సరీ. అర్జెంటుగా బాత్రూమ్ వచ్చినా సరే స్వైప్ చెయ్యనిదే బాత్రూమ్ డోర్లు కూడా తెరుచుకోవు. కాబటి నేను ఆ కుక్కలకన్నా వేగంగా పరిగెత్తుకుంటూ మెయిన్ రోడ్డుపైకొస్తా.
హైదరాబద్ లో బసెక్కటం కన్న ఎగురుతున్న విమానం ఎక్కటం చాలా సులువు అందుకే అందరూ ఆటో ఎక్కుతుంటారు. అప్పుడెప్పుడో టైమ్ మాగ్జైన్ most intelligent people on earth పోటీలలో గెలుపొందిన మన హైదరాబద్ ఆటో వాళ్ళతో మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. మామూలుగా సెవెన్ సీటర్ ఆటోలో పది మందికి పైగా ఎక్కించుకునే ఇక్కడ ఆటోవాళ్ళు. పొద్దున పూట అదీ సాఫ్త్వేర్ ఇంజినీర్స్ అని తెలిస్తే ఒకే ఆటోలో ఓ 20 మందిని కుక్కేస్తాడు.
ఎలాగోలా పొద్దున 8 కల్లా ఆఫీస్ చేరుకుంటా. నాకిది రెండవ ప్రాజెక్ట్ మొదటి ప్రాజెక్ట్ లో జావా లో క్లాస్ డిక్లేర్ చెయ్యమంటే 7th క్లాస్ అని డిక్లేర్ చేసిన నా టాలెంట్ చూసి ఆ ప్రాజెక్ట్ వాళ్ళు వారం రోజులు కోర్ కమిటితో చర్చలు జరిపి చివరకు వీళ్ళిద్దరికీ ఈ ప్రాజెక్టులో అప్పగించారు వాళ్ళే వినాస్ బేరా, బైసాకి సేన్గుప్తా. వినాస్ బేరా మా ప్రాజెక్ట్ లీడర్, బైసాకి సేన్గుప్తా మా ప్రాజెక్ట్ మానేజరు. శ్రీకృష్ణుడు భూమ్మీదున్న అందరి రాక్షసులనీ చంపుతున్నప్పుడు వీళ్ళిద్దరూ వచ్చి మా ఆఫీస్ లో తల దాచుకున్నారు. అప్పటి నుండి వీళ్ళు ఇక్కడ ఉండిపోయారు. వీళ్ళకు అమాయకుడైన అశ్విన్ కుమార్ దొరికాడు. పొద్దున్న ఎనిమింటినుండి రాత్రి తొమ్మిదీ తొమ్మిదిన్నరవరకు నాకున్న చిన్న బుర్రని వంటామదంలో వేయించుకుని తింటున్నారు. ఈహింసలో గూగుల్ ది కూడా కొంత పాత్ర ఉంది. నేను ప్రాజెక్ట్ లో చేరిన మొదటి రోజు ఆ బేరా గాడొచ్చి నువ్వు tickle మీద పని చెయ్యాలి గూగుల్ లో tickle అని టైపు చేసి నేర్చుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను గూగుల్ లో ఎంత సేపటికీ tickle, learn tickle అని కొడుతుంటే You mean pickle ? అని అంటుందే తప్పా. సరిగ్గా సమాధానం ఇవ్వదే. ప్రతి రోజు నేను ఆఫీస్ కు రావటం నేను tickle అని కొట్టటం గూగుల్ pickle ? అని అడగటం ఇదే వారం సరిపోయింది. ఆనాడు అన్నమయ్యకు ఆ పద్మావతి దేవి భూమ్మీదకు దిగివచ్చి సహాయం చేస్తే, నా బాధ చూసి చూసీ నా పక్కన డెస్క్లో కూర్చునే పద్మావతి సిగ్గుపడుతూ అశ్విన్ tickle స్పెల్లింగ్ అది కాదు tcl అని చెప్పి నాకు సాయం చేశారు. ఇదంతా CBCID ద్వారా తెలుసుకున్న ఆ బేరా గాడు నాకు ఒకే సారి ధర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలపెట్టాడు. అప్పటి నుండి కొరడా పట్టుకుని వాడు ఆ బైసాకీ ఎప్పుడూ వెనకాలే ఉంటారు.
అయినా తప్పంతా నాదే, కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు రెండు సంవత్సరాల బాండ్ రాసిమ్మంటే
రెండు సంవత్సరాలేంటి ఖర్మ యావజ్జీవము, అహర్నిశము, విశ్వాస భద్దుడనై మీ హితుడనై ప్రవర్తింపునని సర్వ సామంత మహీపాల మండాలాధిపతులు, సమస్త ప్రజానీకము విఛ్ఛేసియున్న ఈ సభా మండపమున శపధము గావించుచున్నాను. అని రజనీ కాంత్ చేసినట్టు రెండు చేతులతో ఒకేసారి సంతకం చేసిపడేశాను.
ఇక్కడ విషయాలేవీ తెలియని మా నాన్న ఫార్మల్స్ లో నాది పెద్ద కటౌట్ చేయించి దుర్గకొండకు అవతల వైపు వేలాడదీసి తెగ మురిసిపోతున్నారు. ఆసిన్ కోసం త్రిష కోసం కావాలని చెన్నయ్ వేయించుకున్న మా కంతుగాడికి వాళ్ళు వాడికి కనపడక. వాడు నాకు కనపడక ఆరు నెలల కావస్తుంది. మా ప్రాజెక్ట్ల్ లో నిషా కటారి కాదు కదా కనీసం కన్నాంబ, కాంచనమాల కూడా లేరు. ఉన్న ఒక్కగానొక్క పద్మావతి పెళ్ళి చేసుకుని బొంబాయి వెళ్ళిపోయింది. ఆ బైసాకి సేన్గుప్తా ను ఎప్పుడో లిస్టు లో బ్లాక్ మార్కర్ తో కొట్టేశా.
మొన్న పని చేసీ చేసీ తలలో నుండి పొగలు వచ్చి తలకు నిప్పంటుకుంది. నా పైన స్మోక్ డిటెక్టర్లు ఉండటంలో పెద్దప్రమాదమేమీ జరగలేదు. ఇదే మంచి సమయం అని దీపావళి కి మూడు రోజులు సెలవడిగా ఇక మా బేరా గాడు తప్పక ఒప్పుకున్నాడు.
చాలా రోజులకు తనివితీరా గురక పెట్టి మొద్దు నిద్రపోతున్నా...అంతలోనే ఓ మంచి కల. ఆ అమ్మాయెవరండి బొత్తిగా బట్లేసుకోదు. డైరెక్టర్ వేసుకోమన్నా మమ్మీ నేనేసుకోనని మారం చేస్తుందే.... ఛా సమయానికి పేరు గుర్తుకురావట్లేదు, ఆ... నిషా కొటారి బీచ్ వడ్డున నా వైపు స్లో మొషన్ లో పరుగెత్తుకుంటూ వస్తుంది. నేను కూడా ఆ చల్లని గాలికి నా రెండు చేతులూ చాపి తనని ఆహ్వానిస్తున్నాను. తీరా తను నా దగ్గరకు వచ్చి నా ఫార్మల్స్ , నా మెడలో ID కార్డ్ చూసి ఛా ఇంకెప్పుడూ నీ దగ్గరకు రాను పో అని స్లో మొషన్ లో వెనక్కు వెళ్ళిపోయింది

63 comments:


ఇది కథ కాదు..

| 0 comments |
|

మొన్నీ మధ్య పాపర్ లో చదివా ఎవరో ఇనప ముక్కలు, రాళ్ళు, గాజు పెంకులు గట్రా గులాబ్ జాములాగా లాగిస్తున్నడన్న వార్త ప్రపంచ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందేమొ కాని మా కాలేజి వాళ్ళను మాత్రం కాదు. దానికి కారణం కోకోల్లలు అని కవర్ చేయను. దానికి కారణం మా కాలేజి కాంటీన్. ఎంతటి వారనన్నాతలదన్నేవారున్నరంటారు, కానీ అందరిని తన్నేది మాత్రం మా కాలేజ్ కాంటీన్ అని గర్వంగా చెప్పుకుంటాను(ము).

********

అది నేను కాలేజ్ చేరిన కొత్తల్లో, అవి రాగింగ్ రోజులు, సీనియర్ లు అలా ఇలా అని అందరూ చెప్పుకుంటున్నారు. ఆ రోజు సాయంత్రం నన్నూ పట్టుకున్నారు మా సీనియర్స్ 

"రేపు పొద్దున్నే తొరగా వచ్చేయ్ కాంటీన్ లో టిఫిన్ చేద్దుగానివి” అన్నాడొక సీనియర్.

ఇంటి కి వెల్లా ఎలాగో రేపొద్దున సీనియర్స్ కాంటీన్ లో టిఫిన్ అన్నరుగా ఈ రొజు తినకుండా రేపు కుమ్మేదామ్ అనుకుని మరుసటి రోజు ఏడింటికల్లా కాంటీన్ కి చేరుకున్నా…

ఇక తిన్నాను చూడండి రాత్రి కూడ అన్నం తినలేదు కదా వరద బాధితులకు విందు భోజనం అందించినట్లు తిన్నాను. ధాంక్స్ అన్నయ్యలూ మీరు చాలా మంచి వాళ్ళు, సీనియర్స్ అంటే మీలా ఉండాలి అని పోసులిచ్చి క్లాస్ కి చేరుకున్నా. అప్పటికి బానేవుంది. మూడవ పిరిడ్ నుండి మొదలైంది అసలు కధ. అదో వింత బాధ, కూర్చోనీయదు, నుంచోనీయదు, నా బాధ ఇది అని ఎవరికి చెప్పుకోలేను, ఎంతో చెప్పుకోవలనిపిస్తున్నా ఏమి చెప్పుకోలేను. ఎవరికి చెప్పినా ఏమి చేయలేని పరిస్ఠితి, ఆ సమయములో నన్ను అర్థమ్ చేసుకునేది కేవలం ఆ బాధను అనుభవించిన వాళ్ళు మాత్రమే. ఇంతలో మా సినియర్స్ వచ్చి అంతా కూల్ చేసారు, రాగింగ్ కేసు కింద పోలిసులకు కంప్లియంట్ చేయద్దని బతిమిలాడారు, మనమూ కాంప్రిమైస్ అయిపోయామ్ అప్పుడు...

**********

మా పరిస్థితి చెపితే చరిత్ర వింటే వింత. అయినా నాకో విషయం అర్థం కాదు కానీ ఈ కాలేజ్ లో స్టాఫ్ బావుంది, ఫర్నిత్యర్ బావుంది, గోడలు బావున్నై, గడ్డి బావుంది, బూజు బావుందంది అని ఆలోచించే వారు ఈ కాలేజ్ కాంటీన్ గురించి ఆలోచించరా???

ఇక మా కాంటీన్ మెను లోకి మీరు తొంగిచూస్తే

-----------టిఫిన్---------------

1. రాళ్ళు ( బజ్జిలూ )
2. రబ్బర్లు ( పూరీలు) 
3. ఇనప ముక్కలు ( ఇడ్లి )
4. గోధుమ పిండి ( చపాతి )

----------------------------------

మీల్స్(మొన్నటివి అయితే) 
స్పెషల్ మీల్స్ (నిన్నటివి అయితే) 

--------------------------------


ఎంతో ధర్యవంతులైతెనో, కొత్త వాళ్ళైతేనో, తప్పకనో తప్ప మా కాలేజ్ కాంటీన్ లో తినటానికి ఎవరూ సాహసించరు, ఒకవేళ తింటే మిగతావాళ్ళు ప్రసవం అయిన అమ్మయిని చూసుకున్నట్టు చూసుకుంటారు, మధ్య మధ్య లో కొబ్బరినీళ్ళు , విసిన కర్ర తో విసురుతూ, వాడు బాత్రూమ్ దాక వెళితే తోడు వెళుతూ, వాడి నోట్స్ పక్కన వాడు రాస్తూ,సాయంత్రం ఎవరన్నా బండి మీద వాళ్ళ ఇంటి దగ్గర దించి, పళ్ళు కొనిచ్చి, జాగ్రత్తలు చెప్పి మరీ వస్తారు, ఈ బాల్యోపచారాలు చూసి సార్ కూడ ఏమీ అనరు, అక్క డ అనుభవం అరవనీయకుండా చేస్తుంది, కష్టం అందరికి కామన్ కదా 

సీనియర్స్ అయిన తర్వాత మేము ఓ రిజిష్టర్ మేంటేన్ చేసాము, ఎవరెవరు ( జూనియర్స్ ) రాగింగ్ లో భాగంగా కాంటీన్లో తిన్నరో తెలుసుకోటానికి ,బఫే లో లాగా నేను అందరికి తిఫిన్ ఇస్తుంటే మా శ్రీరామ్ గాడు మందులు, శ్రీకాంత్ గాడు పళ్ళు, నటరాజ్, అరుణ్ గాడు గేట్ దగ్గర ఆటో మాట్లాడి పంపించా ట మ్ ఇలా Freshers party చేసామ్. ఇలా తరతరాలకు మా నిధి ని చేకూరేటట్టు చూశామ్. ఇలా అన్నా మా కాంటీన్ కు నిధులు చేకూరాయని మమ్మల్ని కేంద్ర ప్రభుత్వమ్ సత్కరించింది కూ డా.

మర్చిపోయా అప్పుడు నేను రాగింగ్ లో భాగంగా టిఫిన్ కోటుంటుoటే పొరపాటున నోరు జారి 

“రాళ్ళు ఓ రెండు ప్లేట్లు ఇవ్వండి”, అనేసా

ఏమన్నా అవుతుందేమొ అని కంగారు పడ్డా దానికి కాంటిన్ వాళ్ళు

"ఓహో ! మీ బాచ్ వాళ్ళు బజ్జీలకు రాళ్ళని పెట్టారా, మరి @#$%^ అని పేరుపెట్టింది ఏ బాచ్ వాళ్ళు",అని నన్నూ అడిగేటప్పటికి నాకు !@#~# అనే రోగం వచ్చినంత పనైంది.


ఇలా కాదని ఇప్పటికీ పావలా కార్డు మీద ఉత్తరాలు రాసే మా సుధీర్ గాడితో ప్రిసిపల్ కి రాత పూర్వకంగా ఉత్తరం రాయించామ్ , వాడు లెటర్ క్రింద 

"బంధుమిత్రుల అభినందనలతో” అని రాసినా దయాహృదుడైన మా ప్రిన్సిపల్ కాంటీన్ బయట ఓ కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేసారు. మరుసటి రోజు పాపర్లో 

"విజయవాడ లో ట్రాఫిక్ జామ్ రెండు గంటలు స్తంభించిన ట్రాఫిక్”,అని చూసి పెరుగుతున్న ప్రజాదరణకు ఆశ్చర్య చకితులైనాము.

****************

సీన్ కట్ చేస్తే అందరం కాంటీన్ లో తింటున్నము .

ఇంతలో మా శ్రీరామ్ గాడు
"సుజాతా నువ్వు రాసిన కంప్లైంట్ పాపరు నా దగ్గరకు వచ్చిందోచ్" అని అరవటంతో అందరూ పరుగోపరుగు ...
తరవాత సుజాత వచ్చి శ్రీరామ్ బుర్ర బద్దలు కొట్టింది, అది వేరే సంగతంకోండి.

****************

నాలాంటి వాళ్ళు కాలేజ్ కి రాకపోవటమ్, ఏదో సాకు చెప్పి attendance అడిగేయటం మామూలే. ఈ సర్ పేరు సత్య కల్యాణ్ పరమ strict ఆయన caption కూడా అదే,attendance అడుగుదామని ఆయన గది లోకి అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళా, ఆయనను చూడగానే చెమటలు పట్టేశాయ్,

"ఏంటి attendance ఆ, వెయ్యను కాక వెయ్యను.

!@#$#%^$%&^(*)

అయినా ఏమైంది నీకు ....",అని అడగగానే 
LKG నుండీ Engineering దాకా అలవటున్న ఓ అబద్దమ్ Fever అని automatic గ్గా వచ్చేసింది నోటినుండీ, కొసమెరుపుగా కాంటీన్ లొ మొన్న భోజనము చేసాక....

వెంటనే సర్ కళ్ళ జోడు తీసి 

"ఏంటీ...Oh!! I can understand your problem, How is your health, take care, I will do the rest of the thing “

అని attendance వేసారు.

**********

ఇంకా మా కాలేజ్ లో చెప్పవలసింది "టీ"గురించి, ఓ టీ ఇవ్వండి అనగానే కప్పుతో వేడి నీళ్ళు ముంచి ఇస్తారు,

ఈ టీ లొ రంగు లేదు,
రంగుంటే రుచి లేదు,
రుచింటే చిక్కదనం లేదు ,

ఆ టీ ఏ టీ అనుకున్నారు అది మాదే

చందన బ్రదర్స్ వాడి శ్రావణ మాసపు డిస్కౌంట్లు మా కాలేజ్ లోనూ ఉన్నయి బిర్యానీలు, గుడ్లు, అప్పుడప్పుడు నిజమైన టీ లు ఇలా ఎన్ని డిస్కౌంట్లు ఇచ్చినా కాంటీన్ లోలాగా పప్పులు మా వాళ్ళ దగ్గరా ఉడకలా…
లక్ష్మి కేశవ ఆది నారాయణ పేరు వినగానే ఎవరో అనుకునేరు వీడు మా కాలేజ్ ఫాక్షనిష్టు, వీడిది సీమ, బాంబులతో ఆడుకున్న వీడు మా కాలేజ్ బజ్జీలంటే ఇప్పటికీ భయపడతాడు. 

ఇక మా పిచ్చోడు శ్రీ కాంత్ గాడు ఇంజినీరింగ్ లోనూ 20 కేజీలే ఉంటాడు, వీడిది ఒంగోలు, తప్పక తప్పక తింటున్నాడు కాంటీన్ లో, మేము TCS లొ select అయినప్పుడు Any doubts? అని HR లో అడిగితే…

” అక్కడ కాంటీన్ బావుంటుందా??” అని అడిగేశాడు.

చెప్పాగా మా పరిస్థితి చెప్తే చరిత్ర వింటే వింతని

***********



అరుంధతి వెడ్స్ అనాధ

| 0 comments |
|


జాతకం బాలేదని మా బామ్మ జగ్గూ దగ్గరకు తీసుకుని వెళితే మీ మనమడు జాతికుక్కను పెంచితే కానీ జామైన గ్రహాలన్నీ మళ్ళీ జనరల్ గా తిరగవన్నాడు. పైగా జాతి కుక్క ఎంపికలో పలు జాగ్రత్తలు అవసరమని ఈ విధముగా రాసిచ్చాడు.
  • కుక్క మాంసహారి అయ్యుండకూడదు.
  • ముందున్న కుడికాలి చిటికిన వేలు కన్నా , వెనకున్న ఎడం కాలి చిటికిన వేలు చిన్నదై ఉండాలి.
  • పుబ్బా నక్షత్రం, మిధున లగ్నంలో పుట్టిన ఆడ కుక్కకు  మీ వాడు అరుంధతి అని నామకరణం చేసి పెంచినట్టైతే, జంక్షన్ లో అందరికీ అడ్డుపడుతున్న జూపిటర్ పక్కకు జరిగి మీవాడు పట్టిందల్లా బంగారమౌతుంది. అని జోస్యం పలికాడు.

శంకర్ కొట్టుకు వెళ్ళి శెనగపిండి తీసుకుని రా అన్నంత సింపుల్ గా మా బామ్మ మా నాన్నను పిలిచి ఇలాంటి కుక్క ఎక్కడున్నా తీసుకుని రా అని ఆర్డర్ వేసింది.

ఓ శనివారం తరవాతి ఆదివారం

ఈ మోగ్లీ గాడు ఇంత చిన్న నిక్కరు వేసుకుని స్కూల్ కు ఎలా వెళతాడబ్బా అని అలోచిస్తుండంగా బెల్ మోగింది. మా బామ్మ పెరట్లో నుండి అస్సిగా నీకుక్కపిల్లేమో రా అని అరిచింది. వెళ్ళి చూస్తే కుక్కపిల్ల కాదు. ఆడపిల్ల
చూడటానికి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో శ్రీదేవి ఐదవ తరగతి చదువుతుంటే ఇలానే ఉండేదెమో అన్నట్టు ఉంది.
'కొంచం అగ్గిపెట్టె ఉంటే ఇస్తారా ?'
నేను ఆ అమ్మాయి వంక అలానే చూస్తుండిపోయా...
'హలో...'
నాలో ఎం మార్పు లేదు.
ఈలోగా ఎక్కడినుండో ఓ వింత జంతువు నా మీద దూకి కరవ బోయింది. నేను భయంతో వెనెక్కి దూకా. ఆ అమ్మాయి 'నో సుధాకర్', అని ఆ జంతువుని వెనెక్కి లాగింది. 'ప్లీజ్ డోన్ట్ మైండ్ మా సుధాకర్ కి కొంచం దూకుడెక్కువ'  అందామె. నాకు సుధాకర్ ఎవరో అర్ధం కాక. 'ఇంతకీ సుధాకర్ ఎవరండి, మీ నాన్నగారా ?'
షటప్ సుధాకర్ మా డాగీ అని సీరియస్ గా వెళ్ళిపోయింది.
0-0

శ్రీకాంతు గాడు ఎప్పుడూ అంటూ ఉంటాడు వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి, లవ్ చేస్తే రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ నే లవ్ చెయ్యాలి అని, అలాంటిది ఆ హీరోయిన్ యే వచ్చి తలుపు తడితే మనం ఎందుకు వదిలెయ్యాలి అని ఆ రోజునుండి ఆ అమ్మాయి వెనకాలా పిచ్చి కుక్కలా తిరిగేవాడిని. సైటు కొట్టేవాడిని, సైకిలేసుకుని ఆ అమ్మాయి చుట్టూ తిరిగేవాడిని. ఆ అమ్మాయి ముందు సచిన్ లా పోజు కొట్టేవాడిని. ఆ అమ్మాయిన నా వైపు తిప్పుకోటాని ఎంచెయ్యాలో తెలియక తమిళా పుస్తకాలు చదివేవాడిని. తమిళ పుస్తకాలా అవెందుకు అని అడగద్దు.చెపానుగా ఏం చెయ్యాలో తెలియక అని. అయినా ఏం లాభం లేకపోయింది. కానీ ఆ సుధాకర్ గాడికి నా విషయం తెలిసిపోయింది. నామీద తన రెండు కళ్ళు అప్పుడప్పుడూ చెయ్యి కోడా వేసేది. కుక్క సాధారణంగా కాలు మీద కరుస్తుందని అంటారు. కానీ ఈ సుధాకర్ గాడు కాలు మీద తప్ప ఎక్కడపడితే అక్కడ కరిచేవాడు. ఆ సుధాకర్ అంటే అసహ్యం పెరిగిపోయింది. ఏం చెయ్యలేక  దాని అంతు ఎలాగన్న చూడాలనుకున్నను. కానీ నేను ఏమీ చెయ్యలేక I hate sudhakar, I hate sudhakar అని రక్తంతో గోడలమీద రాసుకునేవాడిని.

అలాంటి నా జీవితంలో కమ్ముకున్నా... చీకట్లోనా...వెలుతురల్లే వచ్చింది మా అరుంధతి. జగ్గూ అన్నట్టుగానే అరుంధతి నా జీవితంలో అడుగుపెట్టగానే  చాలా మార్పులు కనపడ్డాయి. ముఖ్యంగా మా నాన్నకు ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్ళిపోయారు. మా నాన్నతోపాటే మా అమ్మ,చెల్లి. ఆ సంవత్సరమే నేను ఫస్ట్ ఎటంప్ట్ లో ఐదవ  తరగతి పాస్ అయ్యా. ఆనందం తట్టుకోలేని మా బామ్మ జగ్గూ నెత్తిన రెండు కొబ్బరికాయలు కొట్టింది. దండకూడా వేద్దామనుకుంది కానీ నెత్తిన గట్టిగా తగలటంతో అందరూ మరసటి రోజు Q కట్టి మరీ వేశారు దండ.

నేను మాత్రం అరుధతిని బాగా చూసుకునేవాడిని. నాకిచ్చిన బూస్టును తనకూ పోసేవాడిని. బూస్ట్ is screat of my energy అంటే our energy అని కపిల్ దేవ్ లా కోరస్ పలికేది. దాన్నేవరరన్నా కుక్కా అని అంటే తిరిగి నేను వాళ్ళని కుక్కా అనేవాడిని. కుక్క కాపలా కాయాలి అన్న మినిమమ్ రూల్స్ కూడా దానికి పెట్టేవాడిని కాదు. పైగా దాన్నేవరన్నా ఎత్తుకు పోతారేమో అని నేనే దానికి కాపలా కాసేవాడిని. అరుంధతి మా సంస్థానానికే రాణి. కానీ మా అరుంధతి కి చిన్న వీక్నెస్ ఉంది. మా అరుంధతికి పిల్లులంటే భయం. అప్పట్లో మా ఇంటి పక్కనే ఉండే కోడిరామకృష్ణ తన సినిమాకు మా అరుధతమ్మ పేరే పెట్టాడని నామొన్ననే తెలిసింది.

విసుగ్గా ఉన్నప్పుడే విస్కీ తాగాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకోవాలి అంటాడు మా శ్రీకాంత్. అందుకే ఆ రోజు నేను అరుంధతి ఇద్దరం రెడీ ఆయ్యి అమ్మాయిని కలవటానికి వెళ్ళాం. ఆ అమ్మాయి కారిడార్ లో కూర్చోని చదువుకుంటుంది. నేను వచ్చానని తెలిసినా నా వైపు కనెత్తి చూడలేదు. నాకు కోపం వచ్చి కాలింగ్ బెల్ రెండు సార్లు కొట్టా. ఆ అమ్మాయి సుధాకర్ ని పిలిచింది. ఆ సుధాకర్ నన్ను కరవటానికి నా మీదకు దూకబోయింది. నాకు భయం వేసి కళ్ళు మూసుకున్నా. కానీ  సుధాకర్ నా మీద దూకకపోవటంతో నెమ్మిదిగా కళ్ళు తెరిచా. ఆ సుధాకర్ మా అరుంధతి  వంక చూస్తున్నాడు. సుధాకర్ కళ్ళల్లో రెడ్ కలర్ లో లవ్ గుర్తులు. అవును సుధాకర్ అరుంధతిని లవ్ చేస్తున్నాడు. ఇదంతా నాతో పాటే గమనించిన ఆ అమ్మాయి. నాకు కుర్చీ వేసి నాకు అరుంధతి కి బూస్టిచ్చింది.

ఆ రోజు నుండీ అంతా విపరీతహః ఆ అమ్మాయి రెవర్స్ లో నాకు లైన్ వెయ్యటం మొదలపెట్టింది. వాళ్ళింట్లో వంటలన్నీ నాకూ అరుంధతికి తెచ్చేది. నాకు హోమ్ వర్కు లు చేసిపెట్టేది.నాతో పాటు నా సైకిల్ ఎక్కేది.ఈ అమ్మాయే ఇలా అనుకుంటే ఆ సుధాకర్ గాడైతే మరీనూ వాళ్ళ ఇంటి బదులు మా ఇంటికి కాపలా కాసేవాడు. టైమ్ దొరికితే మా ఇంటికొచ్చి అరుంధరతి ని ప్రేమిస్తూ ఉండేవాడు. చిత్రం భళారే విచిత్రం సినిమాలో లాగా ఆ అమ్మాయి మాఇంటికొచ్చి 'సుధాకర్, సుధాకర్, సుధాకర్ ఉన్నాడా అండి' అని మా తలుపు పగల కొట్టేది. 'ఎందుకు లేడండి పొద్దున్నుండీ ఇక్కడే చచ్చాడు' అని వెక్కిరించేవాడిని. నాకు స్కూల్లో హోమ్ వర్క్ ఇచ్చినా, నాకు చిరాగ్గా అనిపించినా,సచిన్ సెంచరీ కొట్టకపోయినా ఆ సుధాకర్ గాడిని పిచ్చి కొట్ట్టుడు కొట్టేవాడిని.

ఒక ఆదివారం ముందటి శనివారం

ఆ రోజు వాలెంటైన్స్ డే. ఆ అమ్మాయి, సుధాకర్ వచ్చి నా ఎదురుకుండా నుంచున్నాడు. ఆ అమ్మాయి స్కూలుకు వెళుతూ తన బాగ్ లోనుండి ఓ రెడ్ రోజ్ తీసి I LOVE YOU అని చెప్పింది. అంతే నాకు చెప్పలేని ఆనందం. నేను ఎదో మాట్లాడబోతుంటే అడ్డొచ్చి మా సుధాకర్ కూడా  మీ అరుంధతి ని లవ్ చేస్తున్నాడు. please accept our loves. అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ సుధాకర్ కూడా ఒక పువ్వు తెచ్చి  మా అరుంధతి ముందు పెట్టి వెళ్ళిపోయాడు. అహా జీవితంలో ఇంతకన్నా అదృష్టం ఉంటుందా ? చీ కొట్టిన అమ్మాయే రోజిచ్చి రోజూ ఇస్తానంటుందే అని అరుంధతి ని ముద్దుపెట్టుకుని మా శ్రీకాంత్ గాడికి ఈ విషయం చెప్పటాని వాళ్ళింటికెళ్ళా...

విషయం అంతా శ్రీకాంత్ కి మొత్తం వివరించా.
శ్రీకాంత్ : సొ అరుధతిని సుధాకర్ కిచ్చి పెళ్ళిచేయ్యటానికి నిశ్చయించుకున్నావా ?
నేను : అవును
శ్రీకాంత్ : మరీ పెళ్ళి అరుంధతి కి ఇష్టమో లేదో కనుక్కున్నావా ?
నేను : ఇష్టం
శ్రీకాంత్ : లేదు-లేదు-లేదు ఈ పెళ్ళి అరుంధతికి ఇష్టం లేదు .
నేను : ఏ?
శ్రీకాంత్ : ఎందుకంటే అరుంధతి ఇంకొకరిని ఇష్టపడుతుంది కాబట్టి - అన్నాడు.
ఆ డైలాగ్ కి నా ప్రపంచం ఆగిపోయింది. కోపోద్రిక్తుడైన నేను 'ఓసేయ్ అరుందతి' అని అరిచా. అరుంధతి నా ఎదురుగా వచ్చి తల దించుకుంది. అరుంధతి అలా తలదించుకోవటం నేను ఎప్పుడూ చూడలేదు.
శ్రీకాంత్ : ఇందులో అరుంధతి తప్పేమీ లేదు. ఇన్నాళ్ళు ఈ విషయం నీ దగ్గర దాచుండటం నాదే తప్పు అని ఈ విధముగా చెప్పటం మొదలపెట్టాడు.

రెండు సంవత్సరాల క్రితం నేను పరిక్షలు రాసి వస్తుంటే  ఓ కుక్క మా సందు చివర చలికి ఒణుకుతూ కనపడింది. నేను వెంటనే నా చొక్కా విప్పి తనమీద కప్పి ఇంటికి వచ్చాను. ఆ మరుసటిరోజు నుండి ఆ కుక్క మా ఇంటికి రావటం మొదలపెట్టింది. ఆ కుక్కకు ఏం పేరు పెట్టాలో తెలియక 'అనాధ' అని పేరు పెట్టా. ఎంతో విశ్వాసంతో ఉండేది అనాధ. ఇంట్లో మిగిలిపోయిన అన్నం అనాధకు పెట్టేవాడిని. అలా అనాధ నేను పెంచుకోకుండానే నా పెంపుడు జంతువయ్యింది. ఒక రోజు కొత్త బెల్టు కొనుక్కున్నానని నాకు చూపించటానికి  అరుంధతి మా ఇంటికొచ్చి అన్నం తింటున్న అనాధను చూసింది. అంతే అప్పటి దాకా నాకూ తెలియదు love at first sight కుక్కలకు కూడా ఉంటుందని. అది గమనించిన నేను ఈ కుక్క ప్రేమలు అస్సిగాడికి నచ్చవని అరుంధతిని గట్టిగా హెచ్చరించా. కొన్ని రోజుల తరవాత మీ అరుంధతి మార్నింగ్ వాక్ చేస్తున్న టైమ్ లో నాలుగు పిల్లులు తనను ఎటాక్ చేశాయి. నీకు తెలుసు అరుంధతికి పిల్లులంటే భయం అని. ఇదంతా డాబాపైనుండి గమనించిన నేను వెంటనే అనాధను పంపించా. అనాధ పిల్లుల బారి నుండి అరుంధతిని కాపాడింది. దాంతో అరుంధతి పూర్తిగా అనాధ ప్రేమలో పడింది. ఇదంతా విని నువ్వేమైపోతావేమో అని నేను ఇన్నాళ్ళు నీ దగ్గర ఈ విషయం దాచానురా దాచాను.

ఇప్పుడు చెప్పరా నీ ప్రేమకోసం అరుంధతి జీవితం నాశనం చేస్తావా ? ?
నీ ప్రేమకోసం వాళ్ళా ప్రేమ పనంగా పెడాతావా ? ?
నీకు మనసు లేదా ? ?
ఆ సుధాకర్ కిచ్చి అరుంధతిని పెళ్ళి చెయ్యటం కన్నా దానికి ఇంత విషం ఇచ్చి చంపరా చంపు. అని అప్పటిదాగా సమాధానం చెపుతున్నవాడు కాస్తా ఎదురు ప్రశ్నలోకి దిగాడు.
ఇదంతా విన్న నా గుండె కరిగిపోయింది.
నేనుః మరి ఆ అమ్మాయి ?
శ్రీకాంత్: ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందనుకుంటున్నావా ?
నేను : అవును
శ్రీకాంత్: కాదు. ఆ అమ్మాయి ప్రేమిస్తుంది నిన్ను కాదు
నేను : నా డాబ్బునా ?
శ్రీకాంత్: నీ బొంద. ఆ అమ్మాయికి సుధాకర్ అంటే పంచప్రాణాలు. ఆ సుధాకర్ కి మీ అరుంధతి అంటే ఇష్టం. అరుంధతి నువ్వంటే ఇష్టం అందేకే ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం. ఒక్కసారి సుధాకర్ కి అరుంధతి అంటే ఇష్టం లేదని తెలిసిందో .. నీ మొహం కూడా చూడదు.
నేనుః ఇంతకీ అనాధ సామాజిక వర్గం?
శ్రీకాంత్:   చీ నువ్వుకూడానా. చెప్తాను విను. అనాధ మనసున్న మంచి కుక్క.. అరుంధతి ఇష్టపడ్డ కుక్క. 
శ్రీకాంత్ చెప్పినదంతా నిజమే కేవలం సుధాకర్ కోసమే నన్ను లవ్ చేస్తుంది తను. అరుంధతి రాకముందు తన ప్రేమ ఎక్కడకు పోయింది అన్న ప్రశ్నను నా దగ్గర సమాధానం లేకపోయింది. వెంటానే శ్రీకాంత్ ని అనాధను పిలిపించమన్నా.

శ్రీకాంత్ 'అనాధా' అని గట్టిగా పిలిచాడు. అనాధ స్లో మోషన్ లో పరిగెత్తు కొచ్చి అరుందతిని వాటేసుకుంటుందనుకున్నా. స్లో మొషన్ లో అయితే వచ్చింది కానీ నా ముందు తోకూపుతూ నుంచుంది. అరుంధతి నా బుగ్గనాకింది. అనాధలో ని వినయం నాకు బాగా నచ్చింది. శ్రియ తరుణ్ లాంటి వాళ్ళ ప్రేమ మధ్య ప్రకాష్ రాజ్ లా ఉండటం నాకు ఇష్టం లేకపోయింది. వెంటానే అరుందతి వెడ్స్ అనాధ అని కార్ద్లు ప్రింట్ చేయించా

ఈ విషయం తెలిసిన సుధాకర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. 15 ఏళ్ళ తరవాత నా ఖర్మకాలి ఈ మధ్యనే ఆ అమ్మాయి మా ఆఫీసులో మా ప్రాజెక్ట్ లో ప్రత్యక్షమయ్యింది. ఎలా మొహం చూపించాలో తెలియక తలతిప్పుకుని తిరుగుతున్నాను. కానీ మా అరుంధతి ఆనందంగా ఉందని తెలిసినప్పుడల్లా నా మనసూ ఆనందంగా ఉంటుంది.  


 

Labels

Followers