Hello Guest! Welcome to our Website.
Something you might want to know about us.
Don't be hesitated to contact us if you have something to say.

మృత్యువుకు ముందు

| |
|



కంప్యూటర్‌ ఆపరేటర్‌ నరేంద్ర సెల్‌ ఫోన్‌కు ఒక మెసేజ్‌ వచ్చింది. ఈ మధ్య కొత్తగా సెల్‌ఫోన్‌ కొన్నాడు. అతడికి పదేపదే మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. ఏదో అర్జంటు మేటర్‌ టైప్‌ చేస్తున్నవాడల్లా మెసేజ్‌ ఓపెన్‌ చేసి చూడకుండా తనపనిలో తానున్నా డు. ఎదురుగా కూర్చున్న పై అధికారి ఆ సెల్‌ అందుకుని మెసేజ్‌ ఓపెన్‌ చేశాడు.‘లాండో ది కిల్లర్‌’ అని మెసేజ్‌ పొడిపొడిగా ఉంది. ఆ అధికారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. 

‘‘ఏయ్‌ నరేంద్రా ఆ టైప్‌ ఆపి ఈ మెసేజ్‌ ఏమిటో చూడు’’ అని అందించాడు.నరేంద్రకు మెసేజ్‌ ఎవరిచ్చారో తెలి యదు. తనకు ఇలాంటి మెసేజ్‌లు రావడం కొన్ని రోజుల నుంచి జరుగుతోంది. అతడు ఒకరకంగా సన్నగా వణికాడు. అధికారి తీక్షణంగా చూస్తూ... ‘‘వ్వాట్‌ నరేంద్ర, నువ్వు సెల్‌ పెట్టుకోమంటే వద్దనేవాడివి. మాకు అందుబాటులో ఉండడం ఇష్టం లేక సెల్‌ వద్దన్నావు. ఈ వారంలో సెల్‌ కొన్నావు. నువ్వు ఏదైనా తప్పుతోవలో ఉన్నావా? లేకుంటే నీకు ‘లాండో ది కిల్లర్‌’ అని మెసేజ్‌ రావడమేమిటి? విషయం ఏమిటో తెలియాల్సిందే.’’

‘‘సార్‌ నేను నాలుగు ఠాణాలకు కేసు ఫైళ్ళు తయారుచేస్తుంటాను. రోజుకు పన్నెండు గంటలు నా పని ఉంటుంది. అందుకు సెల్‌ వద్దనుకున్నాను. ఇప్పుడు మా ఆవిడ కొనమని పోరుపెడితే కొనక తప్పలేదు. అందులో సెకండ్‌ హ్యాండ్‌ది, తక్కువ ధరకు వచ్చింది. ఈ సెల్‌ కొన్నప్పటి నుంచి నాకు తప్పుడు వ్యవహారానికి సంబంధించిన మెసేజ్‌ లు, ఫోన్‌ కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. ఎక్కువగా రెడ్‌లైట్‌ కేసులే. తిరిగి ఇచ్చేద్దామని అనుకు న్నాను. ఈ సెల్‌ ఒకప్పుడు బడా భయ్యా అనే రౌడీది. వాడు జబ్బుపడి సర్కార్‌ ఆసుపత్రిలో ఉన్నాడు. వాడు నాకు తక్కువకు అమ్మాడు’’ ఆ సెల్‌ తీసుకుని ఆ అధికారి వెంటనే క్రైం ఇన్‌స్పెక్టర్‌ స్వరూప్‌ పంపాడు. అతడు దవాఖానాకు పోయాడు. అక్కడ సాదాసీదా బెడ్‌మీద తీవ్రమైన అనారోగ్యంతో పడున్నాడు బడాభయ్యా. ఇన్‌స్పెక్టర్‌ను చూడగానే చేతులు ఎత్తాడు.

‘‘ఏరా భయ్యా ఎంతగా బతికావు. ఏమి చేశావురా అంత డబ్బు. ఎన్ని దోపిడీలు, ఎన్ని దొంగతనాలు. కళ్లుకప్పి ఎలా కొట్టేసే వాడివి పర్సులు. ఓహ్‌ నీదో గ్రంథమే. అలాంటిది ఇప్పుడు ఈ దిక్కుమాలిన ఆసుపత్రిలో రంగునీళ్లమందుతో, పూటకు ఇచ్చే పలుచని పాలతో, ఎండిన రొట్టె ముక్కలకే పరిమితం అయ్యావు. ఇంతకీ నీ రోగమేమిటంట?’’ బెడ్‌కు కొద్దిదూరంలో నిలబడి పెద్ద గొంతుతో అడిగాడు.
పక్కబెడ్‌ మీద ఉన్న రోగులు గతుక్కుమ న్నారు. ఇంతవరకు భయ్యా అంటే మంచోడు, సాదాసీదా శాల్తీ అనుకున్నారు. ఇంత పెద్ద కథతో పక్క బెడ్‌ మీద పడున్నాడా? ‘ఈమధ్య మనకు బంధువులు తెచ్చి ఇచ్చే యాపిల్స్‌, మంచి రొట్టెలు, చిల్లర డబ్బులు అవన్నీ వీడే కొట్టేశాడన్నమాట’ అని ఎవరికి వారే ఎప్పుడెప్పుడు ఏవేవి కనబడకుండా పోయాయో గుర్తు తెచ్చుకుని ఇన్‌స్పెక్టర్‌కు అక్కడే ఫిర్యాదు చేశారు.
అంతవరకు బడా భయ్యా ఇన్‌స్పెక్టర్‌ మాటలకే ఇబ్బంది పడుతున్నవాడు పక్క బెడ్‌ రోగుల ఫిర్యాదుతో ముఖం వేలాడేశాడు.

‘‘అయ్యా గత ఏడాదిగా నేను తిరుగాడడం లేదు. మరి మీరెందుకు వచ్చారు. నన్ను ఈ నరకంలో కూడా సరిగ్గా ఉండనీయరా? నేనే తప్పూ చేయలేదే? చావలేక బతకలేక పడు న్నాను. మీరడిగారే నా దోపిడీల గురించి అవి కొల్లగొట్టిన పాపపు సొమ్ము మనవద్ద నిలవవు. నా తలదన్నేవాడి చేతిలో పోగొట్టు కున్నాను. మీ పోలీసులకు ఎంతో ముట్టజె ప్పాను. మీ వద్ద కూడా ఆ పాపపు డబ్బు నిలవదు. మీకు ఫిర్యాదు ఇచ్చినవాడిని కూడా వదలకుండా బలవంతపు వసూళ్ళు చేసే వారు’’ అని ఒకింత గుర్రుగానే బెడ్‌ మీద నుంచి గొంతు పెగుల్చుకుని మరీ అన్నాడు.

ఆ మాటలకు ఇన్‌స్పెక్టర్‌ గుర్రు గా చూశాడు. పక్క బెడ్‌ మీద వారు... ‘నేరకపోయి ఫిర్యాదు చేశాం. కొంపదీసి నోటిమాటగా ఇచ్చిన ఫిర్యాదుకు ఈ పోలీసు డబ్బు గుంజుతాడా? ఏమిట’ని... ‘‘అయ్యా ఏదో అనేశాం. ఇతగాడు మంచిగానే ఈ మంచాన పడి ఉన్నాడండీ’’ అని క్లీన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు.

‘‘రేయ్‌ భయ్యా చావుబతుకుల్లో ఉన్నావని వదిలేస్తున్నా నీ మాటలు విని ఊరుకునేవాడిని కాను. నీ నుంచి ఒక్క రూపాయి ఎప్పుడైనా తీసుకున్నానా ముఠ్ఠాల్‌, ఇప్పుడు చెప్పరా నీవు అమ్మేసిన సెల్‌ నెంబర్‌కు ఈ రోజు ఒక మెసేజ్‌ వచ్చింది. ‘లాండో ది కిల్లర్‌’ ఎవడ్రావాడు?’’

‘‘ఓహ్‌ ఇది అడగ డానికి వచ్చి నన్ను నానామాటలతో బాధించావు. నేను నేర జీవి తాన్ని కోరుకునే దిశలో లేను. కిల్లర్‌ అనేవాడు ముంబాయి గుండా. వాడికి ఏదో పని పడి ఉంటుంది. నేను వాడితో కలిసి ఐదేళ్ల క్రితం పనిచేశాను. ఇంకా నేను నేరాల్లో ఉన్నానని నా సెల్‌కు మెసేజ్‌ ఇచ్చాడు. వాస్తవానికి మాలాంటి నేరగాళ్ళు సెల్‌ ఫోన్లు వద్దనుకుంటే మరో గుండాకు ఇచ్చేస్తాం. నా ఖర్మ కాలి, ఆ సెల్‌ అమ్ముకుంటే వచ్చే డబ్బుతో ఇంత ముద్ద తినవచ్చనుకున్నాను. అందుకే మీ ఠాణాలో టైపు చేసే నరేంద్రకు పెద్ద ధరగల సెల్‌ను అతి తక్కువ ధరకు అమ్మాను.’’

‘‘కిల్లర్‌ను ఎవరు ఏ పనిమీద పిలిచి ఉంటారు?’’‘‘రంజన్‌ అనే దాదాకే కిల్లర్‌తో పని పడు తుంది. వాడు వచ్చాడంటే మర్డర్‌ చేయడానికే వస్తాడు. మీరు వెంటనే రంజన్‌ పై దృష్టిపెట్టం డి. కిల్లర్‌ దొరికిపోతాడు. ఇక కిల్లర్‌ సన్నగా పొడుగ్గా చురుగ్గా ఉంటాడు.’’ ‘‘రేయ్‌ భయ్యా! నువ్వు ఇలా పడుకుని మాకు సూచనలు చేయకు బే. మాతో నువ్వూ వచ్చి వారిని చూపాలి. అప్పుడే వాళ్లు తప్పించుకుని పోలేరు.’’ అని లేవనెత్తి నిలబెట్టి అక్కడే ఉన్న కానిస్టేబుళ్ల మీదకు తోసేశాడు. పడబోయిన వాడిని ఆ కానిస్టేబుళ్ళు పట్టుకున్నారు.

జీపులో కూర్చున్నాక భయ్యా! విస్కీ కోరాడు. తెచ్చి ఇచ్చారు. అప్పుడు వారిని మరో గొంతె మ్మ కోరిక కోరాడు... పిస్తోలు కావాలని. ఎందుకంటే కిల్లర్‌ను పట్టిస్తున్నానని పసిగడితే ఊరుకోడు. నేను పిస్తోలుతో ఎదురుంటే తప్ప వాడిని పట్టుకోలేం. దాంతో ఒక్క గుండు వేసి పిస్తోలు ఇచ్చారు పోలీసులు. రంజన్‌ డెన్‌లోకి వెళ్లారు. పోలీసులను చూడగానే ముఠా ఉలిక్కిపడింది. అప్పటికే పోలీసులు తుపాకులు గురిపెట్టారు. పోలీ సుల మధ్య ఉన్న బడాభయ్యాను చూసి ‘‘ఏరా నిన్ను కొల్లగొట్టి లేకి బికారిని చేశానని పోలీసులతో వచ్చావా? అని మీదకు దూసుకువచ్చారు. భయ్యా వెంటనే పిస్తోలు రంజన్‌ తలకు తగిలించి కాల్చేశాడు.

పోలీసులు అయోమయంగా చూశారు. అక్కడ వారు వెతికే కిల్లర్‌ లేడు. అప్పుడు భయ్యా చెప్పాడు. ‘‘నా సంపాదనను నా నుంచి దోచుకున్న రంజన్‌ను చంపడానికి నేను నా సెల్‌ను అతి తక్కువ ధరకు మీ కంప్యూటర్‌ ఆపరేటర్‌కు అమ్మాను. నేనే ‘లాండో ది కిల్లర్‌’ అని మెసేజ్‌ ఇప్పించాను. మీరు వచ్చి నాచేతికి పిస్తోలు ఇచ్చి మరీ నా శత్రువు ముందు నిలబెట్టారు. అదను చూసి అంతం చేశాను. నేను చచ్చేలోపు పగతీర్చుకున్నాను.’’ అని అంటూ...పెద్దగా అరుస్తూ కుప్పకూలాడు. అనారోగ్యం తిరగబెట్టింది. గుడ్లు తేలేశాడు.(గుండాల పగలు ఇలా ఉంటాయని చెప్పే కథనం ఇది)
- యర్నాగుల సుధాకరరావు,
సెల్‌: 9985265313

ఈ కథలను సూర్య పత్రిక నుంచి కాపీ  చేయ్యతమైనది.వీటిపై  మాకు ఎలాంటి    రైట్స్ లేవు.

0 comments:

Post a Comment

 

Followers