అందరికీ ప్రేమ అమృతపాణి అరటి పండు నాకు మాత్రం కేవలం దాని తొక్క. ప్రతీ సారి నేను దాని మీద కాలెయ్యటం పడటం పళ్ళూడకొట్టుకోవటం అలవాటయ్యిపోయింది.
జీవితంలో 1. షైలాభాను, 2. షాన్వాజ్ ఓ చెరగని ముద్ర వేశారు.
ఓ అమావాస్య రాత్రి, దరిద్రుడు దేవదాస్ రాసిన " ప్రేమలో సఫలం పొదందటం ఎలా ? ", అన్న పుస్తకాన్ని తలుపులేసుకుని కొవ్వొత్తి క్రీనీడలో నా కళ్ళజోడు సరి చేసుకుంటూ చదువుతున్నా. 92 వ పేజీలోకొచ్చా, చివరి ఛాప్టర్, పేరు "అదృష్టానికి ఆఖరి మెట్టు". అందులో ఒకంటికాలి పై నిలబడి చేతులు రెండూ పైకి జాపి జోడించి ఈ మళయాళీ మంత్రాన్ని మూడు సారు చదవాలి అని రాసుంది.
మంత్రం: എവഡി കര്റ്റകു എവഡു ഖര്മാ ( తెలుగనువాదం చివరిలో తెలుస్తుంది ). మూడవ సారి చదవబోతుంటే..."ప్రేమ ఎంత మధురం ప్రియురాళ్ళు ఎంత కఠినం ..." అంటూ నా ఫోన్ మ్రోగింది. రాత్రి 12 అవటంతో బయట నక్కలరుస్తున్నాయి. ఫోనెత్తా...
"హాయ్ మీనూ హాపీ బర్త్డే టూ యు.."-అని అవతల నుండీ వినపడంది.
నేను వెళ్ళి అద్దం లో చూసుకున్నా, అవును నేను నేను లానే ఉన్నాను కదా మరి ఫోన్ లో ఎవరు మీనూ అన్నారు. అనుకుని
నేను నా పాత కాల్ సెంటర్ బాషలో : "క్షేమించాలి మీకు కలిగిన అసౌకర్యానికి. ఇచ్ఛట 'మీను' అను పేరు గలవారెవ్వరూ లేరు. దయచేసి మీ నెంబరు మరొక్క సారి చెక్ చేసుకుని కాల్ చెయ్యగలరని తెలియచేస్తున్నను. "- అన్నను.
అటు: "సారీ సార్ నా పేరు సులక్షణ రెడ్డి. ఈ రోజు మా ఫ్రండ్ మీన పుట్టిన రోజు, పొరపాటున వ్రాంగ్ నెంబర్ నొక్కాను. ...... మిమ్మల్ని డిస్ట్రబ్ చేశాను"
ఇటు: "ఛా ఛా సార్ ఎంటి ??? అశ్విన్ అను. అయినా ఏం పర్లేదులే నేను కోడి కూసేంత వరకూ నిద్రపోను. పొరపాట ఎవరికన్నా జరగచ్చు నోప్రాంబ్లెమ్, ఈ రోజు పొరపాటున నాకు నీదగ్గర నుండి కాల్ వచ్చింది. రేపు నీకు నా దగ్గర నుండీ రావచ్చేమో, నువ్వు దానికి ఫీల్ అవ్వకు ...."-అన్నా
అటు: "ఓహ్ అశ్విన్ ఆ, నైస్ నేమ్ ( ఇటువైపు నేను ఫ్లాటు ) ఒకే ధెన్ బాయ్."- అని ఫోన్ పెట్టేసింది.
ఆహా అదృష్టానికి ఆఖరి మెట్టు పని చేసింది ఆ మంత్రం చాలా గొప్పదిలా ఉంది అని ఆ పుస్తకాన్ని ఆ జాగ్రత్తగా కళ్ళకు దణ్ణం పెట్టుకోని షెల్ఫ్ లో దాచిపెట్టుకున్నా. రాత్రి మూడింటికి మెళుకువ వచ్చి ఆ నెంబర్ ను "౩.సులక్షణ రెడ్డి" అని సేవ్ చేసుకుని హాయిగా పడుకున్నా.
*******
రాత్రి సులక్షణ విషయం చెప్పటానికి మా వాళ్ళంనందరినీ కాలేజ్ మాన్పించా. జరిగినదంతా పూస గుచ్చినట్టు చెప్పా. అంతా విని మా శ్రీకాంతు గాడు. "రేయ్ నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా మన కాంటీన్ ఫుడ్ తింటున్నావా. అసలు ఈ రోజు మీనా B'day అన్నావ్ కదా పొద్దున నుండీ ఫోన్ చేశావా. పరిచయాలు పెంచుకోవాలిరా ఎప్పుడు నేర్చుకుంటావ్ చెప్పు. పనిలో పని నన్నూ పరిచయం చెయ్యి, ఎన్నాళ్ళని నేను మాత్రం నీ చూట్టు తిరగను చెప్పు వాళ్ళ ఫ్రండ్స్ ఉంటారుగా, ఏమంటావ్ "- అని నాకు సలహా ఇచ్చినట్టే ఇచ్చి ప్రాధేయపడ్డాడు.
శ్రీకాంత్ నాలాగే ఓ ప్రేమ ఖైది, ఓ ప్రేమ దొంగ, ఓ ప్రేమ ఫకీర్, ఓ ప్రేమ దరిద్రుడు.
"సరీ-గమా-పద-నిస్సా...అరె కరో కరో ఇక జల్సా...." అంటూ నా ఫోన్ మోగింది.
శ్రీకాంత్: ఏంట్రా రింగ్ టోన్ మార్ఛినట్టున్నవ్??
నేను: రాత్రి ఏదో మంచి కలొస్తే....
వాడు. నీకు తొందరెక్కువరా
నేను: నీకు కుళ్ళెక్కువకానీ మందా ఆ ఫోనెత్తు.
వాడు: "రేయ్ సులక్షణ రా ఉండు నేను మానేజ్ చేస్తా.." -అని ఫోనెత్తాడు.
ఫోన్లో:: "హలో అశ్విన్ ఉన్నాడా ??"
శ్రీకాంత్:"హలో... అశ్విన్ ఆ, చదువుకుంటున్నాడండీ, వాడు కాలేజ్ టాపర్ కదా చదువుకుంటూ ఉంటాడు. మొన్న క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యాడు కానీ ఛదువే లోకం అనుకునే మనిషి అండీ వాడూ...( నిజం చెప్పాలంటే నేను నా Supplementary Exams కి స్లిప్పులు రాసుకుంటున్నాను). అసలు మావాడని చెప్పటం కాదుకానీ మావాడికి రానిదంటూ ఏమీ లేదు భరతనాట్యం, వెస్ట్రన్ డాన్సూ, వేణువు, కరాటి, కర్రాట, వంటొండటం, ముగ్గులేయటం, చివరికీ చెప్పులు కూడా అధ్బుతంగా కుడతాడు. ఇక ప్రోగ్రామింగ్ లోకొస్తే Java, Oracle, Html, Xml, Bsnl లో దిట్ట. ఉండండి వాడిని పిలుస్తాను అని . "రేయ్ అస్సిగా పొద్దున్నుండి చదువుతున్నవ్, ఓ ఐదు నిమిషాలు రిలాక్స్ అవ్వు సులక్షణ అంట, నీకు ఫోన్ ర్రా.."- అన్నాడు కొంచం గట్టిగా.
నేను తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ లా "ఏంటీ సులక్షణానా..." అని పరిగెడుతున్నట్టు చెప్పుల సౌండ్ చేసి, ఆయాస పడుతూ ఫోన్ తీసుకున్నా... అక్కడ నాకు 200/100 మార్కులు పడ్డయ్ మా శ్రీకాంత్ గాడి ప్లాన్ వల్ల.
***
ఇక అప్పటి నుండీ మొదలు, ఏమ్ మాట్లాడూకుంటామో ఏమో తెలియదు కానీ ప్రతీ రోజూ మాట్లాడుకుంటునే ఉండే వాళ్ళం. నెమ్మిదింగా సులక్షణ కాల్ చెయ్యటం మానేసి Missed calls మాత్రమే ఇచ్చేది. తను అలా మిస్డ్ కాల్ ఇవ్వగానే నేను చేసేవాడిని.కాదు చెయ్యాల్సొచ్చేది. కనీసం రోజు కు ఓ రెండు వందలయ్యేది, ఫోన్ ఖర్ఛు. ఏం మాట్లాడుకుంటామో తెలియదు కానీ గంటలు గంటలు గడిచిపోయేవి. ఏదో రోగం వచ్చినవాడిలా ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతునే వుండేవాడిని. అ చెవి నెప్పొస్తే ఈ చెవితో, ఆ చెయి నొప్పొస్తే ఈ చేతితో, రెండు చెవులూ నొప్పొస్తే Loud speaker పెట్టుకుని, రెండు చేతులూ నెప్పొస్తే బుజానికీ తలకూ మధ్యలో ఫోన్ పెట్టుకునీ మాట్లాడుతునే ఉండేవాడిని. మా కాలనీ వాళ్ళు "పిల్లోడు నిన్నటివరకూ బానే ఉండేవాడమ్మా ఏమైందో ఏమో "- అని కొందరు అనుకుంటుంటే మరి కొందరు "వీడెప్పుడో మాట్లాడుతునే పోతాడాని మరికొందరు అనుకునే వాళ్ళు.", ఎవరేమనుకున్నా గురి తప్పని అభినవ్ బింద్రా లా నేను చలరేగిపోయేవాడిని. నువ్వు నాకు నచ్చావ్, నిన్నే ప్రేమిస్తా వరకూ వచ్చింది మా కధ. అన్నీ బానే ఉండేవి ఆ ఒక్క ఫోను బిల్ తప్ప. నాకు అప్పటిలో Best Vodafone User of the Year అని అవార్డు ఇచ్చారు. చివరకు Congrats చెప్పటానికీ తను Missed కాలే ఇచ్చింది.
***
అసలు మా ప్రేమను ప్రేమ లేఖ సినిమాలా మేంటేన్ చెద్దామనుకున్నా. ఓ సారి తను "అశ్విన్ నీకు హాలీడేస్ యే గా మా ఊరు రావచ్చుగా అంది. వస్తాడు నా రాజు ఈ రోజు.... అంటూ వెయిట్ చేస్తా, మనది మామూలు ప్రేమ కాదు కృష్ణా- విజయనిర్మల ప్రేమ అంది,"-ఇక్కడ నేను ఫ్లాట్. నా ఉద్దేశంలో
ప్రేమికులంటే కృష్ణా- విజయనిర్మల,
జంట అంటే కృష్ణా- విజయనిర్మల,
భార్యా భర్తలంటే కృష్ణా- విజయనిర్మల.
తనూ కృష్ణా- విజయనిర్మల అనగానే కాదనలేకపోయా.
"ఇంతకీ నెన్నెక్కడికి రాను ?" అనిడిగా
అప్పుడు నాకటువైపు నుండీ వినపడిన శబ్దం "క-డ-ప"
****
శ్రీకాంత్ గాడే దగ్గరుండి నాకు కొబ్బరికాయతో దిష్టి తీసి కడపకు తన డబ్బులతోనే బస్సెక్కించాడు. మన తెలుగు సినిమాలలో లాగా కాకుండా పెద్ద పెద్ద ట్విస్టులేమి లేకుండా ఇద్దరం కలుసుకున్నాం. సులక్షణ అన్న పేరు వినగానే పేరుకు తగ్గట్టు ఉంటుందనుకున్నా, కానీ మన తెలంగాణా శకుంతల డిగ్రీ చదివేటప్పుడు ఎలా ఉండేదో అచ్చు అలానే ఉంది. అయినా గతి లేని వాడికి గంజేనమ్మ పానకం అన్నట్టు.అడ్జస్ట్ అవుతామ్ అందులో ఏముంది. అందందేముంది ?? మనసు, మనసు ముఖ్యం కదా.
Restaurant కు వెళ్ళాం, చాలా సేపు మాట్లాడూకున్నం, సాయంత్రం నాలుగయ్యింది. దగ్గరలో ఉన్న పార్కు కు వెళ్ళం. నాకు కడపలో అడుగుపెట్టినప్పటి నుండీ ఓ వింత అనుభవం ఎదురయ్యింది. మేమిదరం అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే అందరూ నన్ను చూసి గుసగుసలాడటం గమనించాను. అందులో నన్నైతే ఏదో వింత జంతువును చూసినట్టు చూస్తున్నరు. సరే అని పార్కులో ఓ చోట కూర్చున్నాము. ఓ పది నిమిషాల నిశబ్దం తరువాత.
తను "మీ ఇంట్లో వాళ్ళు మన ప్రేమకు ఒప్పుకుంటారా ? "-అని అడిగింది.
నేనొప్పిస్తానుగా అన్నాను, తను దానికి "నీకో విషయం చెప్పాలి". ఆకాశం ఒక్కసారిగా మేఘామృతమయ్యింది. ఒక్కసారిగా ఓ పెద్ద శబ్దం, మెరుపులు.
తను: "నువ్వు సమరసింహారెడ్డి సినిమా చుశావా ????"
నేను: హహా బారులు తీరిన బాలకృష్ణ ఫానులలో ముందుండేది నేనే తెలుసా?
తను : " కామెడీ కాదు సీరియస్, ( తను ఎంతో ఆవేశంగా లేచి, నెమ్మిదిగా చెప్పటం మొదలు పెట్టింది) సమరసింహారెడ్డి , ఆ సినిమా బేస్ స్టోరీ మాదే. మా తాతల నుండీ మా శత్రువు. ఆ వీరరాఘవరెడ్డి. వాడి రక్తం నేను కళ్ళ చూడాలి, మా నాన్న గారు ఆదికేశవ రెడ్డి, వాళ్ళంటిమీద కాకి మా ఇంటి మీదవాలిందని కాకికి గురిపెడితే, ఆ కాకెగిరిపోవటంతో ఆ గుండు, గుండు వీరశంకర రెడ్డికి తగిలింది. మా నాన్నకు జీవిత ఖైదు పడింది, నాకు ఇద్దరన్నలు, పెద్దన్నయ్య చెన్నకేశవ రెడ్డి, ఆల్-ఖైదా తో అర్రగ్రేటం చేశాడు తాలీబాన్ కు పారిపోయాడు. మా రెండవ అన్నయ్య గోధారెడ్డి, నక్సలైట్ గా ఆరేళ్ళు చేసి మొన్ననే జల్సా సినిమా చూసి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. నా ప్రతీకారాన్ని, మా నాన్న ప్రతీకారాన్నీ తీర్చటానికి ఓ మోగాడు కావాలి. నన్ను నువ్వు చేసుకుని ఆ వీరరాఘవరెడ్డి తల మా ఊరి నడి బొడ్డున తెగ నరికి మా నాన్నకు క్యాసుల్కం గా ఇవ్వాలి. ఆ రక్తం తో నా నుదుటున మన కళ్యాణ తిలకం దిద్దూ .... చెప్పూ చంపుతావా వాడిని,నా పగా, మా నన్న పగా తీరుస్తావా?"- అనడిగింది.
వామ్మో...... వార్నాయినో ... ఈ చంపటమేమిటో ... ఆ రక్త మేమిటో...ఆ రక్తంతో బొట్టు పెట్టే ఆ Effect ఏమిటో .... నాలుగు ముక్కలు చదివి రెండు మూడు నెలలలో Soft గా మృదుపరికరణ నిపుణుడిగా ( Software Proffesional )జీవితం మొదలు పెడదాం అనుకుంటుంటే.... ఈ ప్రేమతో నా పాడె లేచేటట్టువుంది. నాకు కాళ్ళు తడిపోతున్నాయి. చెమటలు పట్టేస్తున్నాయి. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్ధితి.
ఇంతలో తను "చెప్పు ఛంపుతావా... నాపగ ఛల్లారుస్తావా ??" అంది. నాకు ఏం చెప్పలో అర్ధం అవ్వట్లేదు. ఛంపుతా అన్ననే అనుకో వాడెవడో వీరరాఘవ రెడ్డి అంటా వాడింటికి తీసుకేళుతుండేమో ???, చంపనూ అంటే నా పని ఇక్కడే అవుట్ దీని చేతిలో. ఇంతలో తనుకు ఫోనొచ్చింది. తను గట్టిగా "అలానా ???" అంది. నాకిక్కడ పిచ్చెక్కిపోతుంది.
తను "అశ్విన్ , మనం ఇక్కడున్నమని ఆ వీరరాఘవ రెడ్డి మనుషులకు తెలిసిపోయిందంటా. నిన్ను చంపటానికి వాళ్ళు వస్తున్నారు "-అంది. నాకు ఆ మాటకే గుండాగిపోయింది. చీమకు కూడా హాని చెయ్యని నన్నెందుకు చంపటం. అన్నెం పుణ్యం ఎరుగని నాలాంటి పసికందు మీదా వీళ్ళ ప్రతాపం.
"ఏంటి ఆలో చిస్తున్నావ్ ???? అశ్విన్ అర్జెంటుగా తొడకొట్టు "-అంది. నేను జాలిగా తన వంక చూశాను.
"ఏం పర్లేదులే... అని భూ ప్రపంఛం బద్దలయ్యేలా భూ-మా-రె-డ్డీ "-అని అరిచింది.
ఉన్న పేర్లే గుర్తుపెట్టుకోలేక చస్తుంటే మళ్ళీ వీడెవడా అనుకునే లోపే ఓ సుమో వచ్చింది. నన్ను లోపలకు ఓ నెట్టు నెట్టింది.
ఊపిరి కూడా సరిగా తీసుకోలేనటువంటి పరిస్ధితి నాది. నిజంగా నన్ను ఎవరన్నా చంపటానికి వస్తున్నారో ఏమో తెలియదు కానీ వీళ్ళ హడావిడి మాత్రం నన్ను నరకయాతనకు గురిచేస్తుంది. ఇంతలో ఫోన్ మోగింది. తీరా చూస్తే మా శ్రీకాంత్ గాడు.
" అస్సి గా పండా కాయా ?" అనిడిగాడు, "పండూ కాదు, కాయా కాదు, బాంబు రా, " అని గట్టిగా ఏడవబోతుంటే,సుమో ఆగింది. నా గుండా ఆగింది. బయటకు చూస్తే -రైవ్లే స్టేషన్. బయట నుండే ప్లాట్ ఫారమ్ మీద ఏదో ట్రైన్ నెమ్మిదిగా కదులుతూ కనపడింది.
రన్నింగ్ ట్రయింగ్ ఎక్కిస్తూ... "ఏం పర్లేదులే ఇక్కడ అంతా నేను చూసుకుంటా వాళ్ళు కనుక మళ్ళి ఎటాక్ చేస్తే ఈ బాంబు వెయ్యి "- అని తన హాండ్ బాగ్ లో నుండీ ఓ బాంబు తీసి నాకిచ్చింది. నాకన్నీ వొణికిపోయాయి. ఆ బాంబు నా చేతికిస్తూ నా ఆశలన్నీ నీ మీదే, I LUV U "-అంది.
"నాకు గట్టిగా ఏడవాలనిపించింది. ఆహా ఏం టైంమింగే నీది, నా జీవితం మీద ఆశలొదులుకో అన్ని ఎంత సింబాలిక్ గ్గ్గా చెప్పావే. దరిద్రపు మొహందానా, చిన్నప్పుడు సీమటపాకాయ పేల్చాలంటే అరమీటరు పాపరుతో వెలిగించి, అరకిలోమీటర్ దురం వెళ్ళి, చెవిలో చేతులు పెట్టుకుని నుంచుండే వాడిని. అలాంటిది బాంబు చేతిలో పెట్టావా? ఎందుకూ పనికి రాని చిల్లు పడిన బిందెలా ఆ మొహం చూడు."- అని మనసులో అనుకుని,నేను కూడా I 2 LUV U అన్నా.
ట్రైన్ స్పీడందుకుంది. టాటా చెప్పి. ఎడం చేతిలో బాంబు, కుడిచేతిలో టికెట్, జేబులో సెల్ పెట్టుకుని, మళ్ళీ ఎవడొస్తాడో,ఏ క్షణాణ ఏమౌతుందో అని, అని బాత్ రూమ్ లో దాక్కున్నా. కొన్ని గంటల తరువాత.....బయట శబ్దం వినపడితే తొంగి చూశా... ప్రకాశం బారేజ్.... హమయ్యా అనుకుని, ఆ బాంబు, నా Vodafone సిమ్ కృష్ణ లో పడేసి, తూర్పు తిరిగి ణ్ణం పెట్టా.
జరిగినదంతా మా శ్రీకాంత్ గాడికి చెప్పటానికి రెండు రోజులు పట్టింది. మీకు చెప్పటానికి ఈ టపా అయ్యింది. ఇంటికి రాగానే వారం రోజులు నన్ను ICU లో పెట్టారు, ఇంతకీ మళయాళీ మంత్రాం എവഡി കര്റ്റകു എവഡു ഖര്മാ అర్థమేమిటో మళయాళం తెలిసిన ఓ స్నేహితుడినడిగా వాడు దానికి "ఎవడి ఖర్మకు ఎవరలు కర్తలు "-అని సమాధానమిచ్చాడు.

63 comments: